రేపు గజ్వేల్‌కు రైల్వే సేఫ్టీ కమిషనర్ రాక
కొడకండ్ల స్టేషన్ వరకు అనుమతుల కోసం పరిశీలన
సేఫ్టీ కమిషనర్, రైల్వే బోర్డు అనుమతులు పూర్తయితే అందుబాటులోకి ప్యాసింజరు రైలు ప్రయాణం
కొడకండ్ల వరకు ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు
గజ్వేల్, ఫిబ్రవరి 9: మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు నిర్మించిన రైల్వేలైన్‌ను రైల్వే సేఫ్టీ కమిషనర్ శుక్రవారం పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా రైల్వేలైన్‌ను పటిష్టతను అధికారులు పరిశీలిస్తూ గూడ్స్ రైలుతో ట్రయల్న్ నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం ప్యాసింజర్ రైలుతో ట్రయల్ రన్ నిర్వహించారు. శుక్రవారం రైల్వేలైన్ పటిష్టతను పరిశీలించడానికి రైల్వేసేఫ్టీ కమిషనర్ రానున్నట్లు అధికారులు వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణం జరుగుతున్నది. మనోహరాబాద్ నుంచి కొడకండ్ల వరకు ఇప్పటి వరకు 33 కిలోమీటర్ల రైల్వేలైన్ పూర్తయ్యింది. 2020 జూన్ 18న అధికారులు గజ్వేల్ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ వరకు ట్రయల్న్ విజయవంతంగా పూర్తిచేశారు. 2020 దసరా నాటికే రైలు ప్రయాణాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించారు. పలు కారణాలతో ప్రారంభించడం వీలు కాలేదు. ఆ తర్వాత గజ్వేల్‌కు గూడ్స్ స్టేషన్ కూడా మంజూరు కావడంతో పనులు చకచకా కొనసాగాయి. ఇదే క్రమంలో కొడకండ్ల వరకు గజ్వేల్ నుంచి రైల్వేలైన్‌ను అధికారులు పూర్తిచేశారు. ఇప్పటికే రైలు ప్రయాణం ప్రజలు అందుబాటులోకి తేవడం ఆలస్యమైనందున, అధికారులు కొడకండ్ల వరకు అనుమతులు తీసుకోవాలని యోచిస్తున్నారు. గజ్వేల్ రైల్వేస్టేషన్ వరకు రైల్వేలైన్‌ను రైల్వే సేఫ్టీ కమిషనర్ గతంలోనే పరిశీలించగా, అదనంగా నిర్మించిన లైన్లతో పాటు కొడకండ్ల వరకు ట్రయల్న్ చేసి శుక్రవారం పరిశీలించనున్నారు. సేఫ్టీ కమిషన్ పరిశీలన పూర్తయి అనుమతులిస్తే, అనంతరం రైల్వే బోర్డు అనుమతులివ్వాల్సి ఉంటుంది. కరోనా దృష్ట్యా ప్రస్తుతం దేశంలోని ప్రధాన రైళ్లు మాత్రమే కొనసాగుతుండగా, రైల్వే బోర్డు అనుమతిస్తే అన్ని మార్గాల్లో ప్యాసింజరు రైళ్లతో పాటు గజ్వేల్ మార్గంలోనూ ప్రారంభించనున్నారు.