మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతుండగా, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. లోతట్టుప్రాంతాలు జలమయమవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడి జనజీవనం స్తంభించింది. రహదారులపైకి నీరుచేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఇండ్లు కూలిపోవడంతో ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ముసురు వర్షంతో వానకాలం సీజన్‌పై అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. చెరువులు పూర్తి స్థాయిలో నిండుతుండడంతో చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మత్స్యకారుల వలలకు భారీ చేపలు చిక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు. సింగూరుకు 8625 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా. నల్లవాగు, నారింజ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఘనపూర్ ప్రాజెక్టు నిండి నీరు కిందికి వస్తుండడంతో వనదుర్గామాత ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో మున్సిపల్ చైర్మన్‌తో కలిసి పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. మరో మూడు రోజులు జోరుగా వానలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పాబయటకు రావొద్దని అధికారులు సూచించారు.
-మెదక్/సంగారెడ్డి న్యూస్‌నెట్‌వర్క్, జూలై 20
మెదక్, సంగారెడ్డి జిల్లాలను మూడు రోజులుగా ముసురు వీడడం లేదు. గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో నీటి వనరుల్లోకి వరద వస్తుండడంతో కళకళలాడుతున్నాయి. సింగూరు, నల్లవాగు, వనదుర్గా ఘనపూర్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరి నిండుకుండలను తలపిస్తున్నాయి. జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్టులోకి వరద వస్తున్నది. ఏడుపాయల వనదుర్గా ఆలయం ఎదుట మంజీర నది పరవళ్లు తొక్కుతున్నది. ఇదే పరిస్థితి ఉంటే రాత్రి వరకు ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకునే అవకాశం ఉంది.
గురువారం మెదక్ జిల్లాలో అత్యధికంగా వెల్దుర్తి మండలంలో 14.41 సెం.మీ.. అత్యల్పంగా నిజాంపేట మండలంలో 4.96 సెం.మీ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 34.3 సెం.మీ, మెదక్ జిల్లాలో 9.46 సెం.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. వాగులు, చెక్‌డ్యామ్‌ల్లో వరద ఉరకలెత్తుతున్నది. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌తో పాటు హవేళీఘనపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఈ వానలు సోయా, పత్తి, చెరుకు, పెసర, మినుము, కంది, జొన్న, మొక్కజొన్నతో పాటు ఇతర వాణిజ్య పంటలకు మేలు చేశాయి. వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా మారారు.