జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో అత్యధికంగా ముస్లిం, మాదిగ, మాల, ముదిరాజ్, గొల్లకుర్మ, లింగాయత్ ఓటర్లు ఉన్నారు. స్థానిక నేతలకు అధిష్టానం ఆవకాశం కల్పించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అధిష్టానానికి దరఖాస్తు చేస్తున్నారు.
కానీ మొదటి నుంచి స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడంతో స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గ సమన్వయకర్తగా వికారాబాద్‌కు చెందిన చంద్రశేఖర్‌ను నియమించింది. దీంతో స్థానిక నేతలు చంద్రశేఖర్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండేందుకు వారు సిద్ధమవుతున్నారు. అధిక ఓట్లు ఉన్న ముస్లింలకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఇవ్వడంలేదని, తక్కువ శాతం ఓట్లు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ తమకు పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
– జహీరాబాద్, సెప్టెంబర్ 20
జహీరాబాద్, సెప్టెంబర్ 20: జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు విస్తరిస్తున్నాయి. కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతల మధ్య భేదాభిప్రాయలు నెలకొన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ జే.గీతారెడ్డి పోటీ చేసి, బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావు చేతిలో ఓటమి పాలైంది. ఈసారి అనారోగ్య కారణంగా పోటీ చేయడం లేదు. దీంతో వికారాబాద్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గ సమన్వయకర్తగా చంద్రశేఖర్‌ను నియమించింది.
గతంలోంచి పార్టీలో ఉన్న నేతలు చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్‌గా ఉంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆ పార్టీకి చెందిన ఝరాసంగం జడ్పీటీసీ భర్త నరేశ్, న్యాయవాది గోపాల్, మాజీ కౌన్సిలర్ సుజాత, మాజీ ఎంపీటీసీ భీమయ్యతో పాటు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక నేతలకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జహీరాబాద్‌లో ముస్లిం ముఖ్య నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు.
అధిక ఓట్లు ఉన్న తమకు కాంగ్రెస్‌లో గుర్తింపు ఇవ్వడం లేదని, తక్కువ శాతం ఓట్లున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ మారేందుకు మరికొందరు సిద్ధమవుతున్నారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ గెలుపు కోసం నియోజకవర్గ సమన్వయకర్తగా రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్‌రావును నియమించి, మండల స్థాయి నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి గెలుపు కోసం దిశా నిర్దేశం చేస్తున్నారు.
కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం ఎక్కడ?
జహీరాబాద్ కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం కరువైందని పార్టీలో అంతర్మథనం నెలకున్నది. పార్టీ అధిష్టానం స్థానికులకు అవకాశం కలిపించకుండా, ఇతర ప్రాంత వ్యక్తికి అవకాశం కలిపిస్తుండడంతో ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం అమలుచేయడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో మాల సామాజిక వర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా టికెటివ్వగా, ఈసారి మాదిగ సమాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంతో ఆ సామాజిక వర్గం వారు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.
దీంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. గతంలో నియోజకవర్గంలో మాల సమాజిక వర్గం కాంగ్రెస్ వైపు ఉండగా, మాదిగ వర్గం అధికంగా బీఆర్ఎస్ వైపు ఉండేవారు. ప్రస్తుతం మార్పు వచ్చే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి మాదిగ సమాజిక వర్గాలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉండడంతో బీఆర్ఎస్కు మేలు కలిగే అవకాశం ఉన్నది. కాంగ్రెస్‌లోని సీనియర్ ఎస్సీ, ముస్లిం మైనార్టీ నాయకులు పార్టీ కార్యక్రమలకు దూరంగా ఉంటున్నారు. గీతారెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన ముస్లిం మైనార్టీ నాయకులకు ప్రస్తుతం ప్రాధాన్యత లేకపోవడంతో వారు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని సమాచారం.
కాంగ్రెస్‌లో ఒక సామాజిక వర్గానిదే ఆధిపత్యం
జహీరాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా ముస్లిం, మాదిగ, మాల, ముదిరాజ్, గొల్ల కురుమ, లింగాయత్ ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌లో తక్కువ ఓటు శాతం ఉన్న ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆధిపత్యం చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ముస్లిం మైనార్టీలు, మాదిగలు, మాలలు, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో తక్కువ ఓట్లు ఉన్న వారు తమకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మండల, గ్రామస్థాయి నాయకులకు కాంగ్రెస్‌లో గుర్తింపు లేకపోవడంతో పార్టీ కార్యక్రమలకు వారు దూరంగా ఉంటున్నారు.
బీఆర్ఎస్లో చేరేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధం
నియోజకవర్గంలోని జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. కొంతమంది నాయకులు బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమైనట్లు సమాచారం. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్‌రావు, ఎమ్మెల్యే మాణిక్‌రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్పుల నరోత్తం, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ తన్వీర్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ కృషి చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్‌రావు సూచనలు, సలహాలతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు ముఖ్య నాయకులు కృషి చేస్తున్నారు.
శాసనసభ ఎన్నికల్లో జహీరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగిరేందుకు వారు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులను బీఆర్ఎస్లో చేర్పించేందుకు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల కంటే అధిక మెజార్టీ సాధించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలోపేతం..
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్కు స్వచ్ఛందంగా ఓట్లు వేసేందుకు సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావును భారీ మెజార్టీతో గెలిపించేందుకు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామా ల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తున్నారు.