సిద్దిపేట, జూన్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 12న పునః ప్రారంభం కాగా, సమస్యలతో విద్యార్థులు చదువులు సాగించే పరిస్థితి నెలకొంది. ఏ పాఠశాల చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ప్రతి బడిలో ఏదో సమస్యతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు.
పూర్తిస్థాయిలో అందని యూనిఫామ్స్…
1నుంచి 3వ తరగతి బాలికలకు ఫ్రాక్, 4వ, 5వ తరగతి విద్యార్థినులకు స్కర్ట్ ప్రభుత్వం అందజేస్తున్నది. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థినులకు పంజాబీ డ్రెస్, బాలురకు నెక్కరు లేదా ప్యాంట్, షర్టుకు రెండు జేబులు, మధ్యలో క్లాత్‌తో పట్టి, భుజాలపై క్లాపులు, రెండు చేతులకు క్లిప్పులతో కూడిన డ్రెస్‌లు అందించాలి.
కానీ, ఉమ్మడి మెదక్ జిల్లా అవసరం మేరకు క్లాత్ రాకపోవడంతో యూనిఫామ్స్ కుట్టడం పూర్తి కాలేదు. దీంతో అరకొరగానే యూనిఫామ్స్ విద్యార్థులకు అందించారు. విద్యార్థులకు ఇంకా 50 శాతంపైగా యూనిఫామ్స్ అందించాల్సి ఉంది. ప్రతి విద్యార్థికి రెండు జతలకు ప్రస్తుతం ఒక జత ప్రభుత్వం ఇచ్చింది. ఇంకో జత మరో 20 రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో పాఠశాలల ప్రారంభం రోజు పాత యూనిఫామ్స్తోనే విద్యార్థులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
నోటుబుక్స్ అంతంతే…
విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పుస్తకాలతో పాటు నోట్ బుక్కులు అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పుస్తకాలు, నోట్ బుక్కులు పాఠశాలల ప్రారంభం రోజు అందించాలని సంకల్పించినా, ఆచరణలో సాధ్యం కాలేదు. తొలిరోజు ఆయా క్లాస్‌కు సంబంధించి కొన్ని టెక్ట్స్ బుక్‌లు అందించారు. నోట్‌బుక్కులు పూర్తిస్థాయిలో రాలేదు.
ప్రభుత్వ బడుల్లో 6 నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అందిస్తారు. 6, 7 తరగతి వాళ్లకు 6 చొప్పున, 8వ తరగతికి 7 నోట్ పుస్తకాలు, 9, 10 తరగతి విద్యార్థులకు 14, ఇంటర్ విద్యార్థులకు 12 నోట్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, పూర్తిస్థాయిలో రాకపోవడంతో ఉన్నవాటిలో కొన్నింటిని మాత్రమే ఇచ్చారు. మిగతావి మరో పక్షం రోజుల్లో అందిస్తామని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అల్పాహారం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో విద్యార్థులకుఅల్పాహారం లేక నీరసిస్తున్నారు.
ఎక్కడి సమస్యలు అక్కడే…
ప్రభుత్వ బడుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి అన్ని సిద్ధ్దం చేస్తామని ప్రభుత్వం గొప్పగా చెప్పింది. విద్యా సంవత్సరం ప్రారంభం రోజు ఒక పండుగ వాతావరణంలో జరిగేది. కానీ, కాంగ్రెస్ హయాంలో ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించలేదు. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిగ్గా లేవు, తాగునీటి సమస్యలు వేధిస్తున్నాయి. భవనాలు అరకొరగానే ఉన్నాయి.
కొన్ని తరగతి గదులు శిథిలావస్థలో ఉండి వానలకు ఊరుస్తున్నాయి. పెచ్చులు ఊడిపోతున్నాయి. పలు పాఠశాలలకు ప్రహరీలు లేవు. మధ్యాహ్న భోజన శాలలు ఇంకా నిర్మించాల్సి ఉంది. ఇలా ఎన్నో సమస్యలు ప్రభుత్వ పాఠశాలలను పీడిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. కొన్ని పాఠశాలలు పూర్తిగా మూత పడ్డాయి. ఇలా అనేక సమస్యలు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్నాయి. వాటి పరిష్కార మార్గం చూపడంలో ప్రభుత్వం విఫలమైంది.
సిద్దిపేట జిల్లాలో…
సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్, కేజీవీబీలు,రెసిడెన్షియల్ బడులు అన్ని కలిపి 1,053 ఉన్నాయి. వీటిలో 95,741 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 901, కేజీవీబీలు 19, గురుకులాలు 27, ఆదర్శ 07, ప్రభుత్వ ఉపాధ్యాయులు 3,391 మంది ఉన్నారు. 110 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 1,20,357 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో 1,248 ప్రభుత్వ పాఠశాలలో 1.09 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.