-మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని
మెదక్, ఫిబ్రవరి 5 : విద్యార్థుల, యువత భవిష్యత్ నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని అన్నారు. శనివారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లతో నిషేధిత డ్రగ్స్, గంజాయి, గుట్కా వంటి చెడు వ్యసనాలకు విద్యార్థులు బానిసలు కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్ధి దశ జీవితంలో అతి ముఖ్యమైందని అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం ఊసుకోవద్దని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గంజాయి అమ్మకాలు, వినియోగంతో జరిగే పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్, గం జాయి ఉత్పత్తి సరఫరా వినియోగానికి సంబంధించిన ఏ మాత్రం అనుమానం వచ్చినా ఏదైనా సమాచారం ఉన్నా వెంటనే పోలీసు వాట్సాప్ నంబర్ 7330671900కు లేదా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.