అవి చొప్పదండి మండలం వెదురుగట్టలోని బోడగుట్టలు. మూడున్నరేండ్ల కిందటి వరకూ ఆ ఐదు గుట్టలపై ఎటు చూసినా రాళ్లురప్పలే. కనుచూపుమేరలో చెట్టూచేమ కూడా కనిపించలే. కానీ, ఇప్పుడా ప్రాంతం చిట్టడవిగా మారింది. ఒకటికాదు రెండుకాదు 178 ఎకరాల్లో పచ్చదనం పరుచుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోయిన అటవీ విస్తీర్ణానికి బదులుగా, ఇక్కడ కేటాయించిన భూమిలో అటవీ శాఖ అద్భుతాలు చేసింది. 80లక్షలు ఖర్చు చేసి అక్షరాలా లక్ష మొక్కలు నాటడమే కాదు, ఒక్కో మొక్కను కంటికి రెప్పలా కాపాడుకున్నది. మూడున్నరేండ్లలో పదేండ్ల ఫలితాన్ని ఆవిష్కరించి రిజర్వ్ ఫారెస్ట్ట్నే సృష్టించింది. దీనిని అటవీ శాఖ శిక్షణ, విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే ప్రత్యేకతను తేగా, అధికారుల పనితీరుపై ప్రశంసల వర్షం కురుస్తున్నది.
– కరీంనగర్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): మూడున్నరేళ్ల కింద ఇదంతా ఐదు గుట్టలున్న ఎడారి ప్రాంతం. మొక్క కూడా మొలకెత్తని రాళ్ల గుట్టలపై చెట్లను పెంచి పచ్చదనాన్ని పెంచారు అటవీ శాఖ అధికారులు. ఏ మొక్క ఎక్కడ బతుకుతుంది? ఏ మొక్కను ఎలా సంరక్షించాలి? ఇలా ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేసి ఒక్కో మొక్కను ప్రాణం పెట్టి పెంచిన అధికారులు చొప్పదండి మండలం వెదురుగట్ట గుట్టలను హరిత శిఖరాలుగా మార్చేశారు. ఇప్పుడక్కడ 178 ఎకరాల్లో ఎటు చూసినా పచ్చదనం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోయిన అటవీ భూమికి బదులుగా ఇక్కడ కేటాయించిన నిరుపయోగ భూమిలో ఈ అద్భుతాలు చేసిన అటవీ శాఖ అధికారుల శ్రమను చూసి మెచ్చుకోని వారు ఉండరంటే ఒప్పుకొని తీరాల్సిందే. మూడున్నరేళ్లలో 80 లక్షలు ఖర్చు చేసి అక్షరాలా లక్ష మొక్కలకు జీవం పోసి, ఈ రిజర్వ్ ఫారెస్ట్ సృష్టించిన తీరును చూస్తే అబ్బురపడాల్సిందే. ఈ ఫారెస్ట్‌ను అధికారులు అటవీ శాఖ శిక్షణా, విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్ది, రాష్ట్రంలోనే దీనికొక ప్రత్యేకతను తెచ్చారు. మూడున్నరేళ్లలో పదేళ్ల గ్రోత్‌రేట్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.
మూడేళ్లలో లక్ష మొక్కలు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కోల్పోయిన అటవీ విస్తీర్ణానికి బదులుగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలోని సర్వేనంబర్ 354లో రాష్ట్ర ప్రభుత్వం 71.366 (178.415 ఎకరాలు) హెక్టార్ల భూమిని అటవీ శాఖకు అప్పగించింది. ఇక్కడి ఐదు గుట్టలు, చుట్టూ రాళ్లు, రప్పలతో ఉన్న భూమిని అటవీ శాఖ అధికారులు పూర్తిగా అధ్యయనం చేశారు. మూడేళ్లలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని, 24 రకాల మొక్కలను ఎంచుకున్నారు. మొక్కలు నాటి, సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంపెన్సేటరీ ఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కంప) నుంచి 80 లక్షల నిధులు సమకూర్చారు.
ఈ నిధులతో 2019 జూన్‌లో అధికారులు మొక్కలు నాటడం ప్రారంభించారు. 2019-20లో సెమీ మెకానికల్ మెథడ్ (ఎస్ఎంఎం)లో 13 హెక్టార్లు, లేబర్ ఇంటెన్సివ్ మెథడ్ (ఎల్ఐఎం)లో 32.60 హెక్టార్లలో కలిపి 45.60 (114 ఎకరాలు) హెక్టార్లలో మొక్కలు నాటారు. 2020-21లో 10, 2021-22లో మరో 10 హెక్టార్లలో, మరో 20 (50 ఎకరాల్లో) హెక్టార్లలో సెమీ మెకానిక్ మెథడ్‌లో మొత్తం 65.60 (164 ఎకరాలు) హెక్టార్లలో లక్ష మొక్కలు నాటారు. మిగిలిన 5.766 (14.415 ఎకరాలు) హెక్టార్లలో చిట్టడవిలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశారు. 21,400కుపైగా మొక్కలను బండ్ ప్లాంటేషన్ చేశారు. వేసవిలో మొక్కలకు నీళ్లు పట్టేందుకు రెండు బోర్లు తవ్వించారు. గుట్టలపై రెండు వాటర్ ట్యాంకులు కట్టించి మొక్కలకు నీళ్లు పట్టించారు. ఫలితంగానే మూడున్నరేళ్లలో పదేళ్ల గ్రోతింగ్ కనిపించిందని అధికారులు చెబుతున్నారు. ఫారెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా పరిశీలించి కితాబిచ్చారు.
ప్రకృతి అందాలకు నెలవు
వెదురుగట్టలో అటవీ శాఖ అధికారులు మూడేళ్ల పాటు కష్టపడి పెంచిన మొక్కలు ఇప్పుడు అనూహ్యరీతిలో పెరిగాయి. ఇంత తక్కువ సమయంలోనే పదేళ్ల గ్రోతింగ్ కనిపించిందని అటవీ అధికారులు చెబుతున్నారు. గుట్టల ప్రాంతంలో రెండు బోర్లు తవ్వించి మొక్కలు నాటిన ప్రాంతమంతటికీ పైప్‌లైన్ విస్తరించి వేసవిలో మొక్కలు నీళ్లు పట్టడం, రాళ్లు, రప్పల్లో మొక్కలు పెరగాలంటే వాటికి కావాల్సిన ఎరువులు అందించడం, పురుగు పడితే క్రిమి సంహారక మందులు వాడడం వంటి కారణాలతో ఇంత తక్కువ సమయంలోనే మొక్కలు ఏపుగా పెరిగాయి. వేలాది మొక్కలు చెట్లుగా ఎదుగుతున్నాయి. ఇప్పుడు వెదురుగట్ట గుట్టలు చిట్టడవిని తలపిస్తున్నాయి. ఐదు గుట్టలపై ఇప్పుడు ఎటు చూసినా పచ్చని మొక్కలే కనిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే దట్టమైన అడవిగా మారిపోతుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
మొక్కలు చెట్లుగా మారుతున్న నేపథ్యంలో ఇక్కడికి వన్యప్రాణులు కూడా వలస వస్తున్నాయి. స్థావరాలు ఏర్పాటు చేసుకున్న నెమళ్లు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. పండ్ల చెట్లు కూడా పెరుగుతున్న నేపథ్యంలో కోతులు కూడా ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. కుందేళ్లు కూడా కనిపిస్తున్నాయని, నక్కల అరుపులు వినిపిస్తున్నాయని ఫారెస్ట్ వాచర్లు చెబుతున్నారు. చెట్లు పెరుగుతున్న క్రమంలో రాత్రి వేళ వందలాది పక్షలు ఇక్కడికి చేరి సందడి చేస్తున్నాయి. అధికారులు తీసిన అంతర్గత రోడ్లను కమ్ముకుని పెరుగుతున్న చెట్లలో గడిపేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారని అంటున్నారు.
అధ్యయన, విజ్ఞాన కేంద్రంగా..
రాళ్లు, రప్పల్లో పెంచిన మొక్కలు చెట్లుగా మారుతున్న వెదురుగట్ట రిజర్వ్ ఫారెస్టు ఇప్పుడు రాష్ట్ర అటవీ శాఖకు అధ్యయన కేంద్రంగా మారిపోయింది. కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్న ఫారెస్టు అధికారులు, సిబ్బందికి ఇదొక విజ్ఞాన కేంద్రంగా మారింది. రాష్ట్రంలోని అటవీ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్లారు. శిక్షణలో ఉన్న ఉద్యోగులను ఇక్కడికి తీసుకొచ్చి ఫీల్డ్ అనుభవాలు నేర్పిస్తున్నారు. ఇలాంటి నిస్సారమైన భూమిలో ఇంత పెద్ద ఫారెస్టును ఎలా సృష్టించారో అనుభవ పాఠాలుగా చూపిస్తున్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు మొదలుకొని కింది స్థాయి అధికారులు, సిబ్బందికి ఇక్కడికి వచ్చి ఈ రిజర్వ్ ఫారెస్టును అధ్యయనం చేసి వెళ్తున్నారు.
కేటీఆర్ గుట్టకు ప్రత్యేకత
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఇక్కడికి తీసుకొచ్చి ఐదు గుట్టల్లో ఒకదానిపై మొక్కలు నాటించారు. ఈ గుట్టకు కేటీఆర్ గుట్టగా నామకరణం చేశారు. కింద ప్రధాన గేటు నుంచి ప్రతి గుట్టపైకి వెళ్లేలా రోడ్లను అభివృద్ధి చేశారు. ఈ గుట్టపై మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు నాటిన జువ్వి మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. ఎవరు నాటిన మొక్కకు వారి పేర్లతో బోర్డులు తగిలించారు. ఈ గుట్టపై నుంచి చూస్తే ఫారెస్ట్ పరిసరాలతోపాటు చుట్టు ఉన్న పొలాలు, గ్రామాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి.
నాటిన మొక్కల రకాలు 24
రావి, మర్రి, చిందుగ, సీమచింత, బందరు, బట్టగనం, జువ్వి, తాని, ఇరికి, బాదం, అల్లనేరేడు, నల్లతుమ్మ, మహాగని, వేప, దర్శనం, మామిడి, నెమలినార, సీతాఫలం, సిస్సో, జమ్మి, మేడి, నారేప, ఇరుమద్ది, కానుగ.
సవాల్‌గా స్వీకరించాం
కాళేశ్వరం నిర్మాణంలో కోల్పోయిన అటవీ విస్తీర్ణానికి బదులుగా ప్రభుత్వం ఈ స్థలం కేటాయించింది. అప్పుడు మేం ఏ మాత్రం నిరాశ పడలేదు. రాళ్లు, రప్పలతో ఉన్న గుట్టలు, వాటి పరిసరాల్లో కూడా మట్టి శాతం చాలా తక్కువ. ఇలాంటి నేలపై ఏ మొక్క బతకదు. కానీ మేం సవాల్‌గా స్వీకరించాం. ప్రణాళికా ప్రకారం గుంతలు తవ్వి ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టిని పోశాం. కొంత కాలం ఆగిన తర్వాత మొక్కలు నాటాం. ప్రతి మొక్కనూ బతికించే ప్రయత్నం చేశాం. బతికించాం కూడా. ప్రత్యేక ఎరువులు కూడా వాడాం. ఫలితంగా మూడేళ్లలోనే మంచి గ్రోతింగ్ వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ ప్రాంతం చిట్టడవిగా మారింది. కోతులు, నెమళ్లు, కుందేళ్లు వంటి వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. ఇక పక్షులైతే లెక్కలేనన్నీ కనిపిస్తున్నాయి. ఇది మాకు ఎంతో సంతోషంగా, గర్వంగా కూడా ఉంది.
– గంటల శ్రీనివాస్ రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (కరీంనగర్)
అన్నీ ఒకే లెవల్లో ఎదిగేలా చూశాం
ఫారెస్టులో రకరకాల మొక్కలు నాటాం. కొన్నింటికి త్వరగా పొడుగ్గా పెరిగే గుణం ఉంటే, మరికొన్నింటికి పొట్టిగా ఉండే గుణం ఉన్నవి. అయితే ఇక్కడ అన్ని ఒకే విధంగా పెరిగేలా చూశాం. 20 శాతం గ్రోత్ ఆలస్యంగా వచ్చే మొక్కలు కూడా త్వరగా పెరిగేలా ఎరువులు వాడాం. అందుకే ఏ చెట్టయినా ఒకే ఎత్తులో పెరుగుతున్నాయి. వేసవిలో ఒక్క చెట్టు కూడా ఎండి పోకుండా చూశాం. ప్రతి చెట్టుకూ నీళ్లు పట్టాం. ఒక వేళ ఎక్కడైనా మొక్క చనిపోతే వెంటనే అక్కడ మరో మొక్కను నాటాం. ఈ ఫారెస్టులో లక్షకుపైగా మొక్కలు బతికి ఉన్నాయి.
– వీ భరణ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
మూడేండ్ల కింద ఇటెవ్వలు రాలే
నా చిన్నప్పటి నుంచి ఈ గుట్టలను చూస్తున్న. ఇటుమొకాన ఎవలు రాకపోయేది. గుట్టల మీద ఒక్క చెట్టు కూడా ఉండక పోయేది. సార్లచ్చి గుట్టల మీద చెట్లు పెట్టినంక మొత్తం అడవైపొయింది. పని మొదలైన కాన్నుంచి ఈన్నే పనిచేస్తన్న. మా ఊరికి మంచి పెరస్తంది. ఇక్కడ అడివి ఉన్నదట అని అందరచ్చి చూసిపోతన్రు.
– కోల శంకర్, వాచర్, వెదురుగట్ట
చాన మంది వచ్చి చూసిపోతున్నరు
చెట్లు పెరుగుతున్నయి కదా.. చూసెతందుకు మస్తు మంది వచ్చి పోతున్నరు. ఈ చుట్టుపక్క ఊర్లళ్ల పెండ్లిళ్లు, పండుగలకు వచ్చెటోళ్లు ఈడికచ్చి అడవంతా తిరిగి పోతున్నరు. మా సార్లు సుతం సూడనియ్యమని చెప్పిన్రు. చాలా సంతోషంగా ఉన్నదని చెబుతున్నరు. పిల్లలను సుతం తీసుకొని వస్తున్నరు.
– బెల్లం అశోక్, వాచర్, వెదురుగట్ట