కంది, ఏప్రిల్ 4: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామశివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం విఫలమయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ప్రమాదంలో గాయపడి ఎంఎన్ఆర్ దవాఖానలో చికిత్స పొందుతున్న కార్మికులను గురువారం ఆయన పరామర్శించారు. క్షతగాత్రులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. చందాపూర్ ఎస్బీ పరిశ్రమలో జరిగిన సంఘటన చాలా బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం, క్షతగాత్రులకు రూ.25లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రుల కంటితుడుపు పరామర్శలు కాకుండా వారికి తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో, ఎంతమంది గాయపడ్డారో, ఏఏ దవాఖానల్లో ఉన్నారో స్పష్టత లేదన్నారు. జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలి చాలామంది కార్మికులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున బాధితులకు తగిన సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. హరీశ్‌రావు వెంట జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఎస్బీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబీకులను గురువారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పరామర్శించారు. పరిశ్రమ వద్ద మృతదేహాల కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబీకుల వద్దకు వెళ్లి ఆయన ధైర్యం చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం బాధిత కుటుంబీకులకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షలు సాయం చేయడంతో పాటు పరిశ్రమలో బాధిత కుటుంబీకులకు ఉద్యోగాలు కల్పించే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ తరఫున మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రకటించారు. పొరుగు రాష్ర్టాలకు చెందిన మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయం చేస్తారని తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, చింతాప్రభాకర్, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌రావు తదితరులు ఉన్నారు.
చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని గురువారం హైదరాబాద్ జోన్ ఐజీ సుధీర్‌బాబు పరిశీలించారు. పరిశ్రమ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని, డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపడతామని ఐజీ తెలిపారు.