మెదక్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఉతంఠ మంగళవారం వీడనున్నది. ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల నేతలు, ప్రజల్లో ఉతంఠ నెలకొంది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని రెండు కళాశాలల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెకింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెకిస్తారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్లు లెకిస్తారు. నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్ సెగ్మెంట్ల ఓట్లను లెకిస్తారు. విశ్వేశ్వరయ్య బ్లాక్‌లో మెదక్ నియోజకవర్గం, ఆర్యభట్ట బ్లాక్‌లో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలు, సెమినార్ హాల్ చాణక్య బ్లాక్‌లో గజ్వేల్ నియోజకవర్గ ఓట్లను లెకించగా, ఎమ్మిడి లక్ష్మీనర్సయ్య మెమోరియల్ బ్లాక్‌లో నర్సాపూర్ నియోజకవర్గం ఓట్లను లెకిస్తారు. గిరిజన బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల గ్రౌండ్ ఫ్లోర్లో సంగారెడ్డి, మొదటి అంతస్తులో పటాన్చెరు ఓట్లను లెకింపు చేస్తారు. ఏడు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బీవీఆర్ఐటీలోని ఆడిటోరియంలో లెకిస్తారు.
నియోజకవర్గాల వారీగా ఓట్లను లెకిస్తారు. అత్యధికంగా పటాన్చెరు నియోకవర్గానికి 18 టేబుళ్లు ఏర్పాటు చేయగా, గజ్వేల్ నియోజకవర్గానికి 15, మెదక్‌కు 14, నర్సాపూర్‌కు 14, సిద్దిపేటకు 14, దుబ్బాకకు 14, సంగారెడ్డికి 14 మొత్తం 103 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా 14,297 పోస్ట ల్ బ్యాలెట్ లెకింపును ప్రారంభించి రెండు రౌండ్లలో పూర్తి చేయనున్నారు. బరిలో 44 మంది ఉండడంతో తుది ఫలితం వచ్చేందుకు సాయంత్రం వరకు సమయం అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ బాలస్వామి తెలిపారు. 423 మంది పోలీస్ ఫోర్స్‌తోపాటు 3 ప్లాటూన్ల టీజీఎస్పీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని, నలుగురి కంటే ఎక్కువ గుంపులు గుంపులుగా తిరగటం చేయకూడదని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు.