సిద్దిపేట, డిసెంబర్ 17: రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాయని, ఈ రెండు పార్టీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని, కేసీఆర్ సీఎం కావాలని, అభివృద్ధిని కాంక్షిస్తూ పల్లె ప్రజలు మంచి తీర్పునిచ్చారని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్ మండ లం నాంచారుపల్లిలో బీజేపీ నుంచి గెలిచిన నర్సింహారెడ్డి ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు, ఒబులాపూర్ గ్రామాలకు చెందిన కాం గ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా, వారికి హరీశ్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు రెండూ నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి అని, ప్రజలను మోసం చేయడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారని విమర్శించారు. బీజేపీది సబ్కా బక్వాస్ విధానమని, బీజేపీ కేవలం ఉత్తర భారత్‌పై ప్రేమ చూపుతూ, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని విమర్శించారు. ఉత్తరాదిలో పండే గోధుమలకు కేంద్రం మద్దతు ధర పెంచి, మన వడ్లకు మాత్రం మొండి చేయి చూపించిందన్నారు. గోధుమల మద్దతు ధర వడ్ల కంటే రూ. 216 ఎకువగా ఉందని, దీనివల్ల మన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. బీజేపీకి ఓటు వేసినందుకు ఒక్కో రైతు ఎకరానికి రూ.7000 నష్టపోయారన్నారు. బీజేపీ సర్కారు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.
రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల విషయంలో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది బీజేపీ కాదా? బావుల దగ్గర మీటర్లు పెట్టాలని చూసిన పార్టీ బీజేపీ అని హరీశ్‌రావు విమర్శించారు. గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీలా కాంగ్రెస్,బీజేపీ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పైకి కొట్టుకున్నట్లు నటిస్తున్నాయని, లోపల మాత్రం రెండు పార్టీలు ఒకటే అన్నారు. కాంగ్రెస్ అవినీతి పాలనకు బీజేపీ రక్షణగా నిలుస్తుందన్నారు.
రేవంత్ చేసిందేమీ లేదు…
కేసీఆర్ కట్టిన బిల్డింగులకు రిబ్బన్ కటింగ్ చేయడం తప్పా, కొత్తగా రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదని, ప్రజలకే బాకీ పడిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి, ఇప్పటికి 22 నెలలు గడిచిందన్నారు. ఒక్కో మహిళకు రూ. 55,000 బాకీ పడిందన్నారు. రూ.4000 పింఛన్ ఇస్తామని మోసం చేసిందని, ఒక్కో వృద్ధుడికి ప్రభుత్వం రూ. 44,000 బాకీ ఉందన్నారు. రేవంత్ పాలనలో భూముల ధరలు దారుణంగా పడిపోయి, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు. విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు.
తెలంగాణకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని, నమ్మకానికి విశ్వాసానికి ప్రతీక బీఆర్ఎస్, కేసీఆర్ అని హరీశ్‌రావు అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని పల్లె ప్రజలు ఓటుతో చెప్పారన్నారు.నాంచారుపల్లి సర్పంచ్ పురుమాండ్ల నర్సింహరెడ్డి (బీజేపీమాజీ మండల అధ్యక్షుడు), వార్డు మెంబర్లు సంకటి అజయ్, బబ్బురు నరేశ్ (చంద్రకళ) కోడెల రాములు, బీజేపీ మండల నాయకులు, బీజేవైఎం నాయకులు జనగామ సందీప్‌గౌడ్, బోనాల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు ఖాతా మల్లారెడ్డి, మేడదుల కొమురయ్య తదితరులు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.