మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 5: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లలో మెదక్ పట్టణానికి చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలోని ఐదో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మామిళ్ల ఆంజనేయులకు మద్దతుగా గురువారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తూ మాయమాటలతో నమ్మించే ప్రయత్నం చేసినా ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. బీఆర్ఎస్ హయాంలో మెదక్ పట్టణం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఇది పట్టణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ హయాంలో మెదక్ జిల్లా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేస్తే.. మెదక్‌లో బీఆర్ఎస్ బీసీలకే అధిక స్థానాలు కల్పించిందన్నారు. కాంగ్రెసోళ్లకు భయం పట్టుకొని బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. మెదక్ మున్సిపాలిటీలో మూడోసారి గులాబీ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, భాస్కర్, మహిపాల్‌రెడ్డి. శివ, లక్ష్మీనారాయణ షాకీర్, శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.