మెదక్, జనవరి 31(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ్గామాత ఆలయ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆలయాభివృద్ధికి రేవంత్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవాలేదు. దీంతో సమస్యలతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయం వద్ద భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మంజీరా నదిలో స్నానాలు చేసేందుకు సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు చెక్‌డ్యామ్‌లో దిగి ప్రమాదాలకు గురవుతున్నారు.
రెండేండ్లుగా ఏడుపాయల ఆలయం పాలక వర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో ఆలనా పాలనా చూసుకునేవారు కరువయ్యారు. ఏటా మహాశివరాత్రికి ఏడుపాయల జాతర నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. మహాశివరాత్రి సమీపిస్తున్నా ఆలయం వద్ద సౌకర్యాలు కల్పించడం లేదు. స్నాన ఘాట్ల వద్ద సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు మంజీరా పాయల్లో స్నానాలు చేసేందుకు వెళ్లి మృతిచెందుతున్నారు. ఆలయానికి పాలక వర్గం లేక అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. చాలా రోజులు ఈవో పోస్టు ఖాళీగా ఉంది. ఇటీవలే ఈవోను నియమించారు.
భారీ వర్షాలకు తీరని నష్టం…
వానకాలంలో సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో మంజీరా నదిలోకి వదిలారు. దీంతో ఏడుపాయల ఆలయం సుమారు ఈ వానకాలం 42 రోజుల వరకు జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద ఉధృతికి ఆలయం ముందు ఉన్న బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఆలయం ముందు భక్తుల క్యూలైన్లో సౌకర్యాలు లేవు. తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు, మరుగుడ్లు లేకపోవడంతో భక్తు లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంజీరా నదిలో స్నానాలు చేసే ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఘనపూర్ ప్రాజెక్టు వద్దకు స్నానాలకు వెళ్తున్నారు. ఆలయం చుట్టుపక్కల ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. మంజీరా నదిలోని చెక్‌డ్యామ్‌లో నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో భక్తులు స్నా నాలు చేసేందుకు వెళ్లి నీట మునిగి చనిపోయిన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.
నీటిలోకి వెళ్లకుండా ఇనుప రాడ్స్‌తో జాలీలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ప్రత్యేక రోజులు, ఆదివారం భారీగా భక్తులు వస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతున్నది. దీనిపై పోలీసులు దృష్టిసారించాల్సిన అవస రం ఉన్నది. దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది కొందరు చాలా రోజులుగా ఏడుపాయల ఆలయంలో విధులు నిర్వర్తిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక దర్శనం పేరుతో భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం టెంపుల్ సర్క్యూట్లో భాగంగా ఏడుపాలయ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించి, ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అంతలోనే ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటికి కార్యరూపం దాల్చడం లేదు.