నర్సాపూర్, ఏప్రిల్ 25: జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నది. ఆయన ఏ అధికారిక ప్రోగ్రాంలో పాల్గొన్నా బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. దీంతో బీఆర్ఎస్,కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంటున్నది. కొద్దిరోజుల క్రితం సిద్దిపేటలో హరీశ్‌రావు సమక్షంలో సైతం ఇన్చార్జి మంత్రి వివేక్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, హరీశ్‌రావు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తీరా శనివారం నర్సాపూర్‌లోనూ అధికారిక కార్యక్రమంలో మంత్రి మాట్లాడిన మాటలు మంట పెట్టాయి.
రసాభసాగా…
జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ప్రోగ్రాంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఓప్రైవేట్ ఫంక్షన్‌హాలులో శనివారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ రసాభసాగా మారింది.బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి వివేక్ చేసిన వాఖ్యలను మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఖండించారు. దీంతో కార్యమ్రం మధ్యలో నుంచే మంత్రి వివేక్ వెళ్లిపోయారు. వివరాలు.. నర్సాపూర్ పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలతో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాక్ష్మారెడ్డి, కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చేష్యాదవ్, కౌన్సిలర్లతో పాటు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, వివిధ మండలాల నుంచి లబ్ధ్దిదారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8లక్షల కోట్ల అప్పుచేసిందన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పైసా ఉపయోగం లేకపోయిన రూ.20వేల కోట్ల మిత్తి కాంగ్రెస్ ప్రభుత్వం కడుతున్నదన్నారు.
గత ప్రభుత్వ నిర్వాకంతోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని, డబుల్బెడ్రూం ఇండ్లు అందరికీ ఇవ్వలేకపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మంత్రి అన్నారు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి స్పందించి మంత్రి తప్పుగా మాట్లాడుతున్నారని ఖండించారు. మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. తులం బంగారం హామీ ఏమైందని,ప్రొటోకాల్ ఎందుకు పాటించడంలేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు మంత్రి,ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. రభస చేయవద్దని, కూర్చోవాలని ఇరు పార్టీల నేతలను మంత్రి వివేక్, కలెక్టర్ ప్రతిమాసింగ్ వారించినా వినకుండా నినాదాలు చేశారు. దీంతో మంత్రి కార్యక్రమంలో మధ్యలోనుంచే వెళ్లిపోయాడు. మంత్రి తీరును బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలు ఖండించారు.