కౌడిపల్లి, మే 12 : బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాం గ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాలో పాల్గొని సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతులను కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ సర్కారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మారిస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్నివిధాలుగా ఇబ్బంది పెడుతున్నదన్నారు. పండించిన ధాన్యం కొనుగోలు చేయక రైతులను అష్ట కష్టాలు పెడుతున్నదన్నారు. ఏకంగా కాంగ్రెస్ కార్యకర్తలే రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారంటే ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. వరి కోతలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు చాలాచోట్ల కాంటాలు ప్రారంభం కాలేదని, లారీలు రాక రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా పడకేసిందన్నారు.

ప్రభుత్వానికి ముందుచూపు లేక రైతులకు ఈ పరిస్థితి దాపురించిందని సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం పనిచేయించే పరిస్థితిలో కాంగ్రెస్ సర్కారు లేదని దుయ్యబట్టారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఏగ్రామానికి వెళ్లినా రైతులు తమ వడ్లు కొంటలేరని కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, త్వరగా కొనేలా చూడాలంటూ తమతో ప్రాధేయ పడుతున్నారని తెలిపారు. సెంటర్లకు వడ్లు తెచ్చి నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదన్నారు. టార్పాలిన్ల కిరాయి రూ.4,5 వేల కట్టాల్సి వస్తున్నదని, నిర్వాహకులు కనీస వసతులు కల్పించడం లేదని రైతులు వాపోతున్నట్లు తెలిపారు.
రైస్‌మిల్లర్లు తరుగు పేరుతో ఒక్కో సంచికి 5కిలోలు తీసుకుంటూ రైతులను మోసం చేస్తూ దోచుకుంటుంటే, ప్రభు త్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకూ కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించేవరకు బీఆర్ఎస్ అండగా ఉం టుందని, రైతులు ఎవరూ అధైర్య పడవద్దని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ధర్నాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారారామాగౌడ్, మాజీ మండల అధ్యక్షుడు రాజునాయక్, వైస్ ఎంపీపీ నవీ న్, సర్పంచ్‌లు బాకీ సుమలత, సత్యంగౌడ్, కుమార్, కుత్బుద్దీన్, నాయకులు దుర్గారెడ్డి, మహిపాల్‌రెడ్డి, ప్రవీణ్‌కుమా ర్, కిశోర్‌గౌడ్, కాంతారావు, రాజు, పోల నవీన్ కుమార్, పలువురు నాయకులు
పాల్గొన్నారు.