రామాయంపేట, డిసెంబర్ 2: రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి తీవ్రత ఎక్కువై పొగ మంచు పల్లెలను కమ్మేస్తోంది. వారం రోజులుగా పొగమంచు మూలంగా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో చుట్టు పక్కల ఉన్న గ్రామాలన్నింటినీ ఈ పొగమంచు కమ్మేస్తున్నది. అర్ధరాత్రి నుంచే మొదలవుతున్న ఈ పొగమంచు ఉదయం 7 గంటలు దాటి సూరీడు ప్రత్యక్షమైనా గ్రామాలు కన్పించడం లేదు. పొగమంచు మూలంగా చలి తీవ్రత ఎక్కువై వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు పంట పొలాల్లోకి వెళ్లలేక ఆరు బయటే మంటలు కాచుకుంటున్నారు. గ్రామాల్లో ఉదయం తీవ్రమైన చలి ఉండటంతో చిన్నారులు, పెద్దలు సైతం మంటలు కాచుకుంటున్నారు. ఇక పొగమంచు మూలంగా ప్రయాణం చేసే ద్విచక్ర వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలకు దారి కనపడక ప్రమాదాలకు గురవుతున్నారు.
చలికాలం మూలంగా ప్రజలు వణికిపోతూ పొద్దంతా స్వెటర్లు వేసుకొనే ఉంటున్నారు. రామాయంపేట పట్టణంలో ఉన్న దుకాణాదారులకు స్వెట్టర్ల విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ సారి వర్షాలు రెండు మండలాలలో సమృద్ధిగా కురవడం చెరువులు, కుంటలన్నీ నిండు గా ఉన్నాయి. దీంతో గతంలో ఎప్పుడూ లేనంతగా చలి తీవ్రత ఎక్కువగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సూర్యోదయం ఉదయం 7 గంటల వర కు వచ్చినా కూడా బయట పొగమంచు మూలంగా ఏమీ కనపడడం లేదు. దీంతో చలి వణకుతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉదయం లేచి కల్లాపు చల్లే మహిళలు సైతం పొగమంచు భయానికి నిద్రలేవకుండా ఇండ్లల్లోనే ఉండిపోతున్నారు. చలికి తట్టుకోలేక వృద్దులు తమ ఇండ్లల్లోని మంచాలకే పరిమితమవుతున్నారు. మరోవైపు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా చలితీవ్రతతో వణుకు మూలంగా జ్వరాలు, దగ్గు, జలుబు, కాళ్లనొప్పులతో దవాఖానల చుట్టూరా తిరుగుతున్నారు. గత మూడు దశాబ్దాల క్రితం ఉన్న చలిని మళ్లీ ఈ ఏడాది చూస్తున్నామని గ్రామాల్లోని వృద్ధులు, గొర్ల, పశువుల కాపర్లు అంటున్నారు. చలి ఎక్కువగా ఉండడంతో రామాయంపేటలో వెలిసిన స్వెట్టర్ల దుకాణాలు వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది.
మాది మధ్యప్రదేశ్ అమయాని, తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం బాగుంటుందని తెలిసి, ప్రతి ఏడాది చలి సీజన్లో తెలంగాణకు వచ్చి వచ్చి రగ్గులు, స్వెట్టర్లు, దుప్పట్లు తదితర వెచ్చటి దుస్తులను అమ్ముతాం. మా ఇంటి దగ్గరికంటే తెలంగాణ రాష్ట్రంలోనే బాగుంది. విక్రయాలు కూడా ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం మంచిగుంది.
ఇక్కడి ప్రజల మంచి మర్యాదస్తులు. మాకు ఇక్కడి ఎలాంటి ఇబ్బందులు లేవు. మాకు మంచిగ సహకరించి వ్యాపారాలు మంచిగ చేసుకోవాలని చెప్తారు. ఇక్కడ ఉన్నంత మర్యాద మేము ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు. చలికాలం సీజన్లో రెండు నెలల పాటు ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకుంటాం. వ్యాపారం చాలా బాగుంది.
సలిబాగా పెడ్తున్నది. గింత సలిని ఎప్పుడూ చూడలేదు. పొద్దుగల్ల లేవంగనే ఎండపొద్దుకే కూసుంటు న్నం. పది గంటలైనా సలి తక్కువైతలేదు. గీ సలి గిట్లనే ఉంటే ఎట్ల బతుకుతమో ఏమో. రాత్రి పండుకునేటప్పుడు కూడా ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా సలి పోతలేదు. ఈ సారి ఎన్నడూలేనంతగా వర్షాలు పడడంతో సలిబాగానే ఉంది. ఈ సలి మూలంగా ఎవుసం పనులకు పోలేకపోతున్నం.
సలి మూలంగా పొద్దంతా ఎండలోనే ఉంటున్నం. పొద్దుగల్లనే జీవాలను తీసుకుని అడివిలోనే ఉండే మాకు పొగమంచుతో శానా ఇబ్బందులు పడ్తున్నం. పది దాటి నా మంచు కురుస్తూనే ఉంటంది. మేము అన్నం తిన్నా నీల్లుతాగినా మాకు ఎండతోనే పొద్దుగడుస్తుంది.
గిపారి సలి శానా ఉంది. సలితోటి ఎవుసం పనులకు పోవలంటనే శానా గుబులైతాంది. ఒకేల పనులకు పోయినా అక్కడ కొద్దిసేపు మంటలు కాచుకునే పనిలోకి వెళ్తున్నం. సలిబాగా ఉండడంతో ఎవుసం పనులు కూడా సరిగ్గా సాగుతలేవ్. కూలీలు కూడా దొరకుతలేరు. సొంతంగానే ఎవుసం పనులను జేసుకుంటున్నం. దినాం.. నీల్లలోనే ఉంటుంటే.. కాళ్లు, షేతులు వంకర్లు పోతున్నయ్.