పైరవీలకు తావు లేకుండా పకడ్బందీ ప్రణాళికలు, అత్యాధునిక సాంకేతికతతో ఎన్నో ఉద్యోగాలను భర్తీ చేసింది టీఎస్పీఎస్సీ. ఒక్క ఆరోపణ లేకుండా వేల రిక్రూట్మెంట్లు చేసింది. ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్న టీఎస్పీఎస్సీ కమిషన్ పని తీరును కేంద్రం, ఇతర రాష్ర్టాల కమిషన్ అధికారులు సైతం అధ్యయనం చేశాయంటేనే ఈ సంస్థ పనితీరును అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాలు అక్రమాలు జరిగాయంటూ నిరాధారణ ఆరోపణలు చేస్తూ టీఎస్పీఎస్సీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో శ్రద్ధ, ప్రణాళికలతో పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులను పక్కదారి పట్టించేందుకు చూస్తున్నాయి. ఉద్యోగార్థుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాల తీరును టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన జిల్లా వాసులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎలాంటి ప్రణాళికలతో పరీక్షలు
సిద్ధమయ్యారనే విషయాలను తెలుపుతున్నారు.
సర్కార్ కొలువుకు చాలా కష్టపడ్డా
– గిరిజన యువకుడు వీర్లావత్ రాజు నాయక్
రామాయంపేట, మార్చి 20: మాది సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతంలోని కల్హేర్ మండలం నాగధర్ గిరిజన తండా. నా పేరు వీర్లావత్ రాజు నాయక్. మా తల్లిదండ్రులు రూప్సింగ్, రుక్మిణీబాయి వ్యవసాయం చేసుకుని బతికే నిరుపేద కుటుంబం. నేను 2017లో టీఎస్‌పీఎస్‌లో పరీక్షలు రాశాను. 2018 జనవరిలో వ్యవసాయ శాఖలో విస్తీర్ణ అధికారిగా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై రామాయంపేట వ్యవసాయశాఖ క్లస్టర్లో పనిచేస్తున్న. నేను కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. నాలాంటి పేద కుటుంబానికి అప్పట్లోనే సీఎం కేసీఆర్ సార్ దయవల్ల ఉద్యోగం వచ్చింది. ఎవ్వరి పైరవీ లేదు. సర్కారు కొలువు కోసం చాలా కష్టపడ్డా, ఉద్యోగం సాధించా. ప్రభుత్వం కూడా ఎలాంటి పైరవీలకు తావులేకుండా ఉద్యోగాల భర్తీ చేసింది. వ్యవపాయశాఖలో నోటిఫికేషన్ పడగానే ఎస్టీ రిజర్వేషన్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగం వచ్చింది.
రూపాయి లంచం ఇవ్వలేదు
తొగుట, మార్చి 20: టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు నియామకాలు చాలా పారదర్శకంగా జరిగాయి. నా పేరు దార నవీన్ కుమార్, తండ్రి బుచ్చయ్య గ్రామం తొగుట నేను 2018లో వ్యవసాయ విస్తరణ అధికారిగా ఉద్యోగం సాధించాను. నాలాంటి నిరుపేద కుటుంబాల్లో సైతం ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు. ఎవరో ఇద్దరు చేసిన తప్పుకు టీఎస్పీఎస్సీని తప్పు పట్టడం సరికాదు. మాది వ్యవసాయ కుటుంబం. ఎంతో కష్టపడి చదివి, ఎవరికీ రూపాయి లంచం ఇవ్వకుండా పరీక్ష రాసి ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం తొగుట మండలం వెంకట్రావుపేటలో విధులు నిర్వహిస్తున్నాను. టీఎస్పీఎస్సీపై చేస్తున్న నిరాధారణ ఆరోపణలను పట్టించుకోకుండా నిరుద్యోగులు కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. ప్రణాళికతో ముందుకు సాగాలి.
– దార నవీన్ కుమార్, ఏఈవో వెంకట్రావుపేట
పరీక్షలు పకడ్బందీగా జరిగాయి
– ఏఈవో సాయికృష్ణ, రామాయంపేట
రామాయంపేట, మార్చి 20: అధికారులు పరీక్షలను పకడ్బందీగా అధికారులు నిర్వహించారు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో చదివితే ఉద్యోగం సాధించడం చాలా ఈజీ. తెలంగాణ ప్రభుత్వం 2016లో టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్స్ వేసింది. అప్పట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసి సొంతంగా ఏకాగ్రతతో చదివాను. ప్రభుత్వం కూడా పైరవీలకు తావులేకుండా మంచి మార్కులు సాధించిన వారికే 2017 జనవరిలో ఉద్యోగాలు ఇచ్చింది. ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉన్నత మార్కులు సాధించి ఉద్యోగంలో చేరాను. మాది మధ్యతరగతి కుటుంబం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం. అమ్మా నాన్నలు నన్ను బాగా చదివించి మంచి ఉద్యోగిగా చూడాలనే ఆశపడేవారు. 2017 జనవరిలో రామాయంపేట పట్టణంలోనే వ్యవసాయశాఖ కార్యాలయంలో విధులను చేపట్టాను. అప్పటి నుంచి మండలంలోని కాట్రియాల క్లస్టర్ పరిధిలోని విస్తీర్ణ అధికారిగా పని చేస్తున్నా. నేను ఉద్యోగం చేయడంతో మా తల్లిదండ్రులు యాదలక్ష్మిరాములు ఎంతో సంతోషించారు.
ప్రణాళికతో చదివాను..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాను బత్తిని సంతోశ్ గౌడ్, ఏఈవో (దుబ్బాక)
దుబ్బాక, మార్చి 20: తెలంగాణ ఏర్పాటుతోనే నాకు ఉద్యోగం వచ్చింది. నేను బీఎస్సీ అగ్రికల్చర్ చదివాను. మాది దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట. అమ్మ బీడీ కార్మికురాలు, నాన్న గీత కార్మికుడు. పేద కుటుంబం కావటంతో నా విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో కొనసాగింది. బీఎస్సీ అగ్రికల్చరర్ పూర్తి చేశాక, కుటుంబ పరిస్థితుల కారణంగా దుబ్బాక వ్యవసాయశాఖ కార్యాలయంలో (ఆత్మ కమిటీలో) కాంట్రాక్టు బేసిక్‌పై కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరాను. మూడేండ్లు అందులో పని చేశాను. 2016లో ఏఈవో గ్రేడ్-2 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగాన్ని వదిలేసి, 3 నెలల పాటు కష్టపడి చదివాను. మా కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం లేదు.
నేను సాధించాలన్న లక్ష్యంతో ప్రణాళికతో చదివాను. ఇందుకు స్టడీ మెటీరియల్స్ సేకరించాను. యూనివర్సిటీ పుస్తకాలతో పాటు ప్రీవియర్స్ బిట్స్ తదితర వాటిని చదివాను. ఉద్యోగం సాధించాలనే తపనతో నిద్రాహారాలు మానేసి, వీలైనంత సమయం చదువుకోసమే కేటాయించాను. నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. సొంత మండలంలోనే ఏఈవోగా ఉద్యోగం రావటం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. నాకు ఉద్యోగం రావటంతో మా తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. చదవుకు పేదరికం అడ్డుకాదు. నేను నిరుద్యోగులకు చెప్పేది ఒకటే బయట విషయాలను (రాజకీయాలను) పట్టించుకోకుండా చదువుపై గురి పెడితే అనుకున్నది తప్పకుండా సాధించగలరు. ప్రణాళికతో చదివితే ఉద్యోగం తప్పకుండా వరిస్తుంది.