సంగారెడ్డి, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం శనివారం బీసీ సంఘాలు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బీసీ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలికింది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా అమలైంది. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాలుపంచుకున్నారు. బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో నిర్వహించిన బీసీ బంద్‌లో పాల్గొన్నారు.
బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలు, రాస్తారోకోలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా బంద్ నిర్వహించారు. ఉదయం నుంచే సంగారెడ్డి, అందోల్, పటాన్చెరు, జహీరాబాద్,నారాయణఖేడ్, మెదక్, నర్సాపూర్, రామాయంపేట, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, జనగామ నియోజకవర్గాల్లో బీసీ సంఘాల నాయకులు బంద్ చేపట్టారు. వ్యాపారస్తులు, వాణిజ్యసంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను రోజంతా నిలిపివేశారు.
బీసీ నేతలు జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. బస్‌డిపోల ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితం అయ్యాయి. బస్సుల రాకపోకలు నిలిచిపోవటంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించాల్సి వచ్చింది. పండుగ సీజన్ కావడంతో ప్రైవేట్ వాహనాల్లో అధిక చార్జీలు చెల్లించి వెళ్లాల్సి వచ్చింది. సంగారెడ్డి డిపోలో బంద్ నిర్వహించటంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఉదయం డిపోలో యోగా చేశారు. సంగారెడ్డిలో బీసీ జేఏసీ నాయకులు బంద్ నిర్వహించారు.
సంగారెడ్డిలోని కొత్తబస్టాండు ఎదుట బైఠాయించిన నిరసన తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు బంద్‌లో పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించటంతోపాటు బీసీ సంఘాల ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో 65వ నెంబరు జాతీయ రహదారిపై నిర్వహించిన రాస్తారోకోలో బీఆర్ఎస్ నాయకులు పాలుపంచుకున్నారు. రాస్తారోకోతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. రాస్తారోకోలో బీసీ నాయకులు బీరయ్యయాదవ్, ప్రభుగౌడ్, మల్లికార్జున్‌పాటిల్, కృష్ణ, రమేశ్, సాయిబాష, బీఆర్ఎస్ నాయకులు విఠల్, రుక్ముద్దీన్, కృష్ణమూర్తి, నగేశ్, శేఖర్,మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరులో నిర్వహించిన బీసీ బంద్‌లో బీఆర్ఎస్ నాయకులు పాలుపంచుకున్నారు.
కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించటంతోపాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జోగిపేటలో నిర్వహించిన బీసీ బంద్‌లో బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్‌గౌడ్, నాగభూషణం, రామాగౌడ్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్‌లో నిర్వహించిన బీసీ బంద్‌లో బీఆర్ఎస్ నాయకులు నారాయణ, వెంకటేశం, సంజీవరెడ్డి పాల్గొన్నారు.