కొల్చారం : మండల కేంద్రమైన కొల్చారంలో యువజన సంఘాలు, దళిత సంఘాల నాయకుల మధ్య వాగ్వాదంతో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు (Tense situation) నెలకొన్నాయి. ఈనెల 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల కేంద్రమైన కొల్చారంలో మెదక్- హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రోడ్డు మధ్యలో దళిత నాయకులు అనుమతి లేకుండా అంబేద్కర్ విగ్రహం ( Ambedkar Statue ) ఏర్పాటు చేశారు.
అదే స్థలంలో యువజన సంఘాల నాయకులు ఛత్రపతి శివాజీ ( Shivaji ) విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ చేసి విగ్రహానికి గద్దె నిర్మాణానికి గుంత తవ్వుతుండగా దళిత యువకులు, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు యువజన సంఘాలు నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాలు నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
స్థానిక ఎస్సై మహమ్మద్ గౌస్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పరిస్థితి విషమిస్తుండడంతో అదనపు బలగాలను పిలిపించారు. పోలీసు బలగాలు ఇరువర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.