దేశంలో తిరుపతి లడ్డూ, బంగినపల్లి మామిడిపండుకు ఉన్న ప్రత్యేక గుర్తింపు మాదిరిగానే సజ్జాపూర్ చామదుంపకు భౌగోళిక గుర్తిం పు లభించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని సజ్జాపూర్‌లో రైతులు 25 ఏండ్ల నుంచి చామదుంప సాగుచేస్తున్నారు. ఇక్కడి సారవంతమైన నేలలు, సాగునీటి వనరులు ఈ పంట సాగుకు అనుకూలంగా మారా యి. చామ దుంప భూమిలో విత్తిన ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల్లో పంట కోతకు వస్తుంది. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ ఉండడంతో సజ్జాపూర్ గ్రామ రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ పంట సాగుకు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కోహీర్, ఏప్రిల్ 29: ఎకరం భూమిలో చామదుంప పంట సాగుకు రూ.30వేల వరకు ఖర్చు అవుతుందని సజ్జాపూర్ రైతులు చెబుతున్నారు. చేను దున్నకం, కూలీల ఖర్చులు, డ్రిప్పు పరికరాలు, విత్తనం కొనుగోలు, మార్కెట్‌కు తరలింపు, తదితర ఖర్చులను రైతులు భరిస్తున్నారు. ఇక్కడ పండించిన దుంపలను బస్తాల్లో నింపి హైదరాబాద్‌లోని బోయిన్పల్లి, మూసాపేట, పటాన్చెరు మార్కెట్లో విక్రయిస్తున్నారు. చామదుంప ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తుండడంతో ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దుంపతో పాటు పత్రాలను కూడా కూర తయారీకి వినియోగించవచ్చు. మిర్చి బజ్జీలుగా కూడా చామ పత్రాలను ఉపయోగిస్తున్నారు. ప్రస్తు తం కిలో రూ.20 ధర పలుకుతున్నది. ప్రతి రైతు పొలంలో ఎకరానికి వంద క్వింటాళ్లకు పైగా దిగుబడి కచ్చితంగా వస్తున్నది. సారవంతమైన నేల, వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 150 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నది. రేగడి, ఎర్ర మట్టి నేలల్లో పండిన దుంపలకు మట్టి కూడా అంటుకోదు. దీంతో కొనుగోలు దారులు కూడా వంటల తయారీలో సంతోషంగా వినియోగిస్తున్నారు. చామదుంపను పండించి రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో 50 ఎకరాలకు పైగా పంటను సాగుచేస్తున్నారు. ఒక రైతు పండించిన పొలంలో తీసిన విత్తనాన్ని మరో రైతు తన పొలంలో నాటుతున్నాడు. దీంతో విత్తనం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పంట సాగుతో వచ్చిన ఆదాయంతో కుటుంబాలను సంతోషంగా పోషించుకుంటున్నారు.
సజ్జాపూర్ గ్రామంలో రైతులు పండిస్తున్న చామదుంప సాగు భౌగోళిక గుర్తింపు కోసం కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ రాజిరెడ్డి, తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సైదయ్య ఆధ్వర్యంలో చేసిన దరఖాస్తును భౌగోళిక గుర్తింపును చెన్నై అధికారులు రిజిస్ట్రీని మంగళవారం ఆమోదించారు. దీంతో ఉద్యాన అధికారులు చేపట్టిన కృషి ఫలించింది. తద్వారా దేశంలో ఎక్కడా విక్రయించినా సజ్జాపూర్ చామదుంపగానే పిలుస్తారు. తమ గ్రామానికి దేశంలోనే పేరు ప్రఖ్యాతి రావడంపై సజ్జాపూర్ అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.
నా చేనులో 25 ఏండ్ల క్రితం చామదుంప పంటను వేశాను. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి నుంచి విత్తనం తీసుకువచ్చి నా చేనులో వేశాను. లాభాలు రావడంతో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కచ్చితంగా నా చేనులో చామ పంట వేస్తున్నాను.
– కొత్తకాపు శ్రీనివాస్‌రెడ్డి, సజ్జాపూర్ (సంగారెడ్డి(సంగారెడ్డి జిల్లా)
చామ దుంప పంట ను ఎక్కడ అమ్మినా సజ్జాపూర్ చామ దుంపగానే పిలిచేందుకు భౌగోళిక గు ర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉం ది. ఉద్యాన అధికారులు సజ్జాపూర్ గ్రా మానికి వచ్చి చామ దుంపను సాగు చేస్తు న్న రైతుల నుంచి వివరాలు సేకరించారు. రైతులకు కూడా ఉద్యాన పంటల సాగుపై అవగాహన కల్పించారు. సజ్జాపూర్ గ్రామానికి ఇంత మంచి పేరు వచ్చేందుకు కృషి చేసిన అధికారులకు ధన్యవాదాలు.
– సుదర్శన్‌రెడ్డి, రైతు, సజ్జాపూర్ (సంగారెడ్డి జిల్లా)
చామ దుంప సాగు చేసేం దుకు ఎకరానికి రూ.30వేల వరకు ఖర్చు అవుతున్నది. ప్రస్తుతం రెండు ఎకరాల వరకు పంట వేశా ను. డ్రిప్పు పరికరాల ద్వారా పంటకు నీటిని అందిస్తున్నాను. పంట ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలకే వస్తుంది. లాభాలు కూడా మంచిగ వస్తుం డడంతో మళ్లీమళ్లీ ఇదే పంటను వేస్తున్నాం.
– ఊరడి అంజయ్య, రైతు, సజ్జాపూర్(సంగారెడ్డి జిల్లా)