పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆయా శాఖలు ఖాళీల వివరాలను ప్రభుత్వానికి అందజేశాయి.వీటిల్లో తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,804 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా, మెదక్ జిల్లాలో వివిధ స్థాయిల్లో 267 ఖాళీలు ఉన్నాయి. దీంతో పోలీస్ అవ్వాలని కలలు కంటున్న నిరుద్యోగులు ఆ దిశగా సన్నద్ధమవుతున్నారు. వీరందరికీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల యువత పోలీసు కొలువు సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు అర్హులను గుర్తించి స్థానిక పోలీస్స్టేషన్లలో దరఖాస్తులు సమర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఉచిత శిక్షణను ప్రారంభిస్తామని, ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచిస్తున్నారు.
మెదక్, మార్చి 29: పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 30,453 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,804 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో 97 కానిస్టేబుళ్లు, 63 హెడ్ కానిస్టేబుళ్లు, ఐదుగురు ఎస్ఐలు, ఒక సీఐ ఖాళీలు ఉన్నట్టు పోలీసుశాఖ అధికారులు తెలిపారు. సాయుధ దళం (ఏఆర్ విభాగం)లో కానిస్టేబుళ్లు 97, హెడ్ కానిస్టేబుళ్లు 3, ఆర్ఎస్ఐలు ఒకటి ఖాళీలుగా ఉన్నాయి.
ఖాకీ బట్టలు వేసుకొని ప్రజలకు సేవ చేయాలనే తపన అందరిలో ఉన్నా అది కొందరికే సాధ్యమవుతుంది. పట్టుదలతో చదివి, కఠోరంగా శ్రమిస్తేనే పోలీసు ఉద్యోగం వరిస్తుంది. ఇదిలావుండగా గ్రామీణ ప్రాంతాల యువత పోలీసు కొలువులు సాధించేలా పోలీసు అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే మండలాల్లో ఉన్న పోలీస్స్టేషన్లలో యువత కానిస్టేబుళ్ల ఉచిత శిక్షణ కోసం పేర్లను నమోదు చేసుకున్నారు.
పోలీసుశాఖలో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు ఉద్యోగంలో చేరేలా యువతను ప్రోత్సహించి ఉచిత శిక్షణకు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఇటీవల ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. జిల్లా పోలీసులు పల్లె ప్రాంతంలోని యువత వివరాలను సేకరిస్తున్నారు. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు అర్హత కలిగిన వారిని గుర్తించి ఆయా పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తులను సమర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
2016వ సంవత్సరం మార్చిలో కానిస్టేబుళ్ల నియామకాలకు నోటిఫికేషన్ రావడంతో చాలామంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. అప్పట్లోనే నిరుద్యోగులకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పట్టణంలోని వీరముష్టి సంఘం భవనంలో సొంత నిధులు వెచ్చించి సుమారు రెండు నెలల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు ఉద్యోగాల్లో శిక్షణ పొందే యువతకు స్టడీమెటీరియల్స్తో పాటు భోజన సదుపాయాలను కల్పించారు. గతంలో 600 మందికి శిక్షణ ఇవ్వగా 300 మంది ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 130 మంది తుది పరీక్షకు అర్హత సాధించడంతో మెదక్, సిద్దిపేట నియోజకవర్గాల వారికి సిద్దిపేటలో శిక్షణ ఇప్పించగా, 13 మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు ఎస్ఐలు పోలీసు ఉద్యోగాలు సాధించారు.
పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికి ఉచిత శిక్షణ ఇస్తాం. త్వరలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. పోలీసు శాఖలో పెద్దఎత్తున నియామకాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖలో చేరేలా యువతను ప్రోత్సహిస్తున్నాం. ఉచిత శిక్షణకు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పల్లె ప్రాంతాల్లో ఉన్న యువత ఎక్కువగా పోలీసు ఉద్యోగాలపైనే ఆసక్తి చూపుతున్నారు. వారి వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉచిత శిక్షణ పొందే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మెదక్ జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– రోహిణిప్రియదర్శిని, మెదక్ ఎస్పీ