సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 21: స్వయం సహాయక సంఘాల మహిళలు ఇటుకల తయారీ, ఇండ్ల నిర్మాణం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం స్వయం సహాయక సంఘాల మహిళలకు న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
శుక్రవారం సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ ఆవరణలోని న్యాక్ శిక్షణ కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు సిమెంట్ ఇటుకల తయారీ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల నుం చి మండలానికి ఐదుగురు చొప్పున న్యాక్ ఆధ్వర్యంలో మహిళలకు ఇటుకల తయారీ, ఇండ్ల నిర్మాణంపై శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఒక్కో విడతలో 35 మందికి ఆరు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు.ఈ శిక్షణ ద్వారా గ్రామాల్లో ఎక్కడికక్కడ ఇటుకలను తయారు చేసే యూనిట్లను నెలకొల్పడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో తక్కువ ధరకు నాణ్యమైన సిమెంట్ ఇటుకలు అందుబాటులో ఉంటాయన్నారు. న్యాక్ ఏపీడీ రామ్, డీఆర్డీవో జ్యోతి, అదనపు డీఆర్డీవో జంగారెడ్డి పాల్గొన్నారు.