మెదక్ జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ గాడితప్పింది. దళారుల పైరవీలు, అధికారుల నిర్ణయాల కారణంగా రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తున్నది. జిల్లాలో రెండేండ్లుగా రెవెన్యూ శాఖలో బదిలీలు జరగలేదు. దీంతో పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. పైసలు ఇవ్వనిదే పనులు జరగడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీసేవ కేంద్రా ల్లో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అక్రమాలకు అడ్డాగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి.
మెదక్, జూన్ 28(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో 21 మండలాలు, మెదక్, తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఉన్నాయి. కొద్దిరోజులుగా రెవెన్యూ డివిజన్ అధికారుల పర్యవేక్షణ తగ్గిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో తహసీల్ కార్యాలయాల్లో సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనిభారం పేరుతో కొందరు ఆఫీసు సమయంలో కార్యాలయంలో ఉండడం లేదు. సాయంత్రం పూట ఆఫీస్‌కు వచ్చి తమకు కావల్సిన ఫైళ్లు పరిశీలించి సంతకాలు చేస్తున్నారని తెలిసింది. ప్రజా సమస్యల పరిష్కారంలో డివిజన్ స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో నెల రోజులుగా విద్యార్థులకు కుల, ఆదాయ, స్థానికత తదితర ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవగా, జారీలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మీ-సేవ నిర్వాహకులు ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు మీ-సేవ నిర్వాహకులు ధ్రువీకరణ పత్రాలు త్వరగా ఇప్పిస్తామని అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బంది మధ్య దళారులుగా పని చేస్తున్నారు. భూ భారతిలో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు మీ-సేవ నిర్వాహకులు రైతుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తు న్నా చర్యలు తీసుకోవడం లేదు. పైరవీ కారులతోనే పోతేనే పనులు వేగం గా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అందుబాటులో ఉండని తహసీల్దార్లు…
తహసీల్ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండడం లేదు. కొందరు తహసీల్దార్లు టూర్ల పేరుతో మధ్యాహ్నం, సాయంత్రం కార్యాలయాలకు వచ్చి సంతకాలు చేసి పోతున్నారు. దీంతో విద్యార్థులు, రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసేందుకు తహసీల్దార్ వెళ్లినట్లు ఆఫీసులో పనిచేసే సిబ్బంది ప్రతిరోజు తెలుపునట్లు ప్రజలు చెప్పారు. ప్రధానంగా తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐలు) అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కారానికి తహసీల్ కార్యాలయాలకు పంపితే, వాటిని పరిష్కరించకుండా బుట్టదాఖలు చేస్తున్నారు. దీంతో బాధితులు మళ్లీమళ్లీ ప్రజావాణిలో దరఖాస్తు చేస్తున్నారు. అయినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిట్టూరుస్తున్నారు. మీ-సేవ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అవినీతి,అక్రమాలు నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అవినీతికి అడ్డాగా మీ-సేవ కేంద్రాలు..
మెదక్ జిల్లాలో 21 రెవె న్యూ మండలాలు ఉండగా, 18 మండలాల్లో తహసీల్దార్లు పనిచేస్తున్నారు. రేగోడ్, వెల్దుర్తి, శంకరంపేట(ఏ) మండలాల్లో ఇన్చార్జి తహసీల్దార్లుగా నాయబ్ తహసీల్దార్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తహసీల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐలు) ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలపై ఆర్ఐలు సంతకాలు చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది. దీనికోసం తహసీల్ కార్యాలయాలకు వెళ్తే, ఎప్పుడు చూసినా ఆర్ఐలు గ్రామాల్లో విచారణ కోసం వెళ్లినట్టు ఆఫీసులో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు. దీంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. తహసీల్ కార్యాలయంలో పనిచేస్తున్న మీ-సేవ కేంద్రాలకు సంబంధించిన సమాచారం చూసే ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
భూభారతి ఆపరేటర్లు వ్యవసాయ భూము ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి చిన్న తప్పును చూపి, భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మీ-సేవ కేంద్రాల నుంచి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని, వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తహసీల్ కార్యాలయానికి వస్తే, ప్రతి రిజిస్ట్రేషన్‌కు మీ-సేవ నిర్వాహకులు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. మీ-సేవ నిర్వాహకులు డాక్యుమెంటేషన్ పత్రాల పై కోడ్ భాషలో నంబర్ వేస్తేనే తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించిన పాత రికార్డుల కోసం తహసీల్ కార్యాలయాలకు వెళ్తే, అక్కడ రికార్డు సెక్షన్లో పనిచేసే వారు నాయబ్ తహసీల్దార్ పేరు చెప్పి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చినా సకాలంలో రికార్డులు అప్పగించడం లేదని పలువురు ఆరోపించారు. మీ-సేవ కేంద్రాలు అవినీతికి అడ్డాగా మారినా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
చర్యలు తీసుకుంటాం..
రెవెన్యూ శాఖలో పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. మెదక్ జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించం. ధ్రువీకరణ పత్రాల జారీ, ఇతర సేవలు సజావుగా జరిగేలా చూస్తాం. మీ-సేవ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. అవినీతి, అక్రమాలకు పాల్పడితే సహించం. ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, సేవలు మెరుగుపరుస్తాం.
– నగేశ్, అదనపు కలెక్టర్, మెదక్