కంగ్టి, మార్చి 7: సంగారెడ్డి జిల్లా కంగ్టిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో మ్యాథ్స్ టీచర్ సురేఖ విద్యార్థినుల పట్ల కర్కశత్వంగా వ్యవహరించారు. రాశి, భువనేశ్వరి, అక్షయ, అశ్విని, సునీత, సోనీ అనే ఆరుగురు విద్యార్థినులను మ్యాథ్స్ టీచర్ సురేఖ చితకబాదడంతో వారికి వాతలు వచ్చాయి. విద్యార్థులు సరిగ్గా చదవకపోతే టీచర్ వారిపై చర్యలు తీసుకోవడం చూస్తుంటాం. కానీ, చెట్లకు నీళ్లు పోయలేదని ఒకరికి, చెప్పిన డ్రెస్ వేసుకోలేదని మరొకరికి, ఇలా పలు కారణాలతో టీచర్ ఆ విద్యార్థినులపై జులుం చూపించింది.
టీచర్ కొట్టడంతో విద్యార్థినుల చేతులు, కాళ్లకు వాపులు రావడంతో శుక్రవారం స్థానిక ప్రైవేట్ దవాఖానలో వారికి చికిత్స చేయించారు. ఈ విషయం శుక్రవారం సాయంత్రం వరకు బయటకు రాలేదు. తీరా సాయంత్రం బయటకు రావడంతో వారి తల్లిదండ్రులకు విషయం తెలిసింది. తల్లిదండ్రులు పాఠశాల చేరుకుని విద్యార్థినులకు గాయాలను చూసి పాఠశాల వద్ద రోదించారు. జీవనోపాధి కోసం తాము హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నామని, ఈరోజు తాము గ్రామానికి వచ్చామని, దీంతో ఈ విషయం తెలిసిందని ఓ విద్యార్థిని తల్లిదండ్రులు వాపోయారు.
పూలమొక్కలకు నీళ్లు పోసేందుకు నిరాకరించినందుకే సురేఖ టీచర్ తమ కూతురు రాశిపై దౌర్జన్యంగా కొట్టిందని వారు ఆరోపించారు. సురేఖ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ఎంఈవో రహీముద్ద్దీన్ను వివరణ కోరగా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన తెలిపారు. బాలికలను విచక్షణారహితంగా కొట్టిన ఉపాధ్యాయురాలు సురేఖపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.