సంగారెడ్డి, సెప్టెంబర్ 21:ఇది తరతరాలకు చెరగని చిరునామా..పక్కాగా ఉంటాం..నమ్మకంగా ప్లాట్ల విక్రయాలు చేస్తామంటూ టీవీల్లో ఊదరకొడుతున్న సువర్ణ భూమి యథేచ్ఛగా చెరువుకుంటను ఆక్రమించింది. సంగారెడ్డి జిల్లా కంది మం డలం చిద్రుప్ప రెవెన్యూ గ్రామం పరిధిలోని బేగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో పటాన్చెరు-దౌల్తాబాద్ రోడ్డుకు సమీపంలో సువర్ణ భూమి ఓ వెంచర్ ఏర్పాటు చేసింది. ఆ వెంచర్ పూర్తిగా గౌరవగారికుంట 18ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమించి మొరం పోసి కుంటను నింపారు. సువర్ణ భూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్లో హైదరాబాద్, పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి ప్లాట్లను ’(ఒక్కొక్కరికి గుంట చొప్పున) విక్రయాలు చేపట్టారు.
గౌరవగారికుంట సర్వే నంబర్ 92లో సుమారు 134 మందికి ప్లాట్లను విక్రయించారు. కొనుగోలు చేసిన భూమిలో ఆన్లైన్లో ప్లాట్లు చేసి విక్రయాలు చేసి రైతుల భూములకు మాత్రం ఇప్పటికీ డబ్బు లు చెల్లించలేదని ఆందోళన వ్యక్తంచేశారు. అందులో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి స్థలం చూపించకుండానే కేవలం మ్యాప్‌లతో రంగురంగుల ఫ్లెక్సీలు, బోర్డులు చూపిస్తూ అమ్మకాలు చేపట్టింది. గుంటల లెక్కన విక్రయాలు చేస్తూ హైదరాబాద్, చుట్టు పక్కల పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇక్కడి విషయాలు తెలియనీయకుండా జాగ్రత్తలు పాటించి గుంటల లెక్కన అంటగట్టారు.
సర్వేనంబర్ 92పూర్తిగా చెరువుకుంటకు సంబంధించిన భూమి. సువర్ణ భూమి యాజమాన్యం రియల్ ముసుగులో కబ్జాలకు పాల్పడుతున్నా సంబంధింత అధికారులు మాత్రం అటువైపుగా కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రియల్ఎస్టేట్ వ్యాపారంలో అనేక లోసుగులు ఉన్నా అధికారులు చేతివాటానికి అలవాటు పడి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్న సర్వేనంబర్‌కు 92/1 వేస్తూ /1లతోనే19/వన్లు వేస్తూ విక్రయాలు జరిపారు. అది పూర్తిగా కుంట భూమి అని తెలిసినా అధికారులు ఎలా వాటిని రిజిస్ట్రేషన్ చేశారో వారికే తెలియాలి మరి.
బేగంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సువర్ణభూమి రియల్ఎస్టేట్ డెలవపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేకుండానే క్రయ విక్రయాలు చేసింది. రైతుల నుంచి కొంత భూమిని కొనుగోలు చేసి వారికి సగం డబ్బులు ఇచ్చి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నది. మిగతా డబ్బులకు చెక్కులు రాసి ఇచ్చి కాలపరిమితి ముగిసినా వారికి ఇప్పటి వరకు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి.
యథేచ్ఛగా గౌరవగారి కుంటను ఆక్రమించి అనుమతులు లేకుండానే వెంచర్ ఏర్పాటు చేసి గుంటల లెక్కన పూర్తిగా విక్రయించింది. ముఖ్యంగా టీవీల్లో ప్రకటనలు ఇచ్చే సువర్ణభూమి ఇది తరతరాలకు చెరగని చిరునామా అంటూ ఎలాంటి అనుమతులు లేకుండా, రేరా, ఎల్పీ నంబర్లు, డీటీసీపీ అఫ్రూవల్ తీసుకోకుండానే అమ్మకాలు చేస్తూ సామాన్య ప్రజలను మోసాలకు గురిచేస్తున్నది. దీనికి రెవెన్యూ అధికారులు సహకరించి రిజిస్ట్రేషన్లు చేశారు. కుంటను కబ్జా చేసి గుంటల లెక్కన విక్రయించిన సువర్ణభూమి యాజమాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కుంట శిఖం భూమిలో ప్లాట్లను కొనుగోలు చేసిన వినియోగదారులు హైరానా పడుతున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌లోని చెరువులు, కుంటల శిఖం భూమి, ఎఫ్టీఎల్ భూముల్లో నిర్మించిన భవనాలు కూల్చివేయడంతో బేగంపేటలో ప్లాట్లు తీసుకున్న యజమానులు హైడ్రాతో హైరానాకు గురవుతున్నట్లు వినికిడి. చెరువులు, కుంటలను కబ్జా చేసి పూర్తిచేసిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేయడంతో శిఖం భూములు తీసుకున్న వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో జిల్లాల వారీగా హైడ్రా తరహా కమిటీలు ఏర్పా టు చేసి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేస్తారోనని యాజమానులు మనోవేదనకు గురవుతున్నారు.
ప్రభుత్వ అధికార యంత్రాంగానికి పలు సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి చెరువులు, కుంటలు, వాగులు, నాలాలు కబ్జాకు గురికాకుండా పర్యవేక్షించాలని ఆదేశించినా ఫలితం శూన్యమనే చెప్పాలి. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల ధనదాహానికి చిద్రుప్ప రెవెన్యూ గ్రామ పరిధిలోని బేగంపేట గ్రామం గౌరవగారికుంటను సువర్ణ భూమి యథేచ్ఛగా అమ్మేసింది. కేంద్ర ప్రభుత్వం మిషన్ అమృత్ సరోవర్ పథకంలో భాగంగా 29 మే 20 22లో గౌరవగారి కుంటలో పూడికతీత పనులను మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో చేపట్టింది.
మొత్తం 38 ఎకరాల్లో పూడికతీత పనులు చేపట్టగా సువర్ణ భూమి వెంచర్ యాజమాన్యం అందులో18 ఎకరాల భూమిని ఆక్రమించి గుంటల లెక్కన విక్రయాలు జరిపింది. ఇది పూర్తిగా ప్రభుత్వానిది అని తెలిసినా గుంటల లెక్కన రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్లు చేశారు. సువర్ణ భూమి యాజమాన్యం కుంటలో మొరం పోసి పూడ్చివేసింది. కుంటను ఎలా పూడ్చివేస్తారం టూ గ్రామస్తులు అందోళన చేపడితే మా ఇష్టం మాకు అందరి సహకారం ఉంది.. మీరేం చేసుకుంటారో చేసుకోండని బెదిరింపులకు పాల్పడినట్లు గ్రామస్తులు వెల్లడించారు. సామాన్య ప్రజలు నివాసం ఉండేందుకు చక్కటి ఇల్లు కట్టుకోవాలనే చిన్న ఆశను రియల్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
గౌరవగారి కుంటను చదును చేసిన విషయం మా దృష్టికి రాలేదు. ఇరిగేషన్ అధికారులు, గిర్దావర్లతో విచారణ చేయించి అన్యాక్రాంతమై తే చట్టపరమైన చర్యలు తీసుకుం టాం. రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు భూమిని చూసి చేయరు గదా.. మాకు గ్రామస్తులు, ఇతరులు ఎవరైనా సమాచారం ఇస్తేనే తెలుస్తుం ది. అధికారుల పని రిజిస్ట్రేషన్లు చేయడం వరకే ఉంటుంది. ఇప్పటి వరకు మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేకపోవడంతోనే సమాచారం లేదు.
– విజయలక్ష్మి, తహసీల్దార్ కంది, సంగారెడ్డి జిల్లా