కొండపాక(కుకునూరుపల్లి), ఫిబ్రవరి 3: సత్యసాయి సేవా సంస్థలు అందిస్తున్న సేవలు మహోన్నతమైనవని, సాయి స్ఫూర్తితో సేవాతత్పరతను అలవార్చుకోవాలని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నాడు. సిద్దిపేట జిల్లా కొండపాక శివారులో ఏర్పాటైన సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ హార్ట్ కేర్ రీసెర్చ్ సెంటర్ను సోమవారం సుమన్ సందర్శించాడు. దవాఖానలో ఆపరేషన్ల తీరును పరిశీలించడంతోపాటు ఆపరేషన్లు చేయించుకున్న చిన్నారులను పలకరించాడు. గుండె ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు చిన్నారులకు మె మోంటోలు అందజేశాడు.
అనంతరం మాట్లాడుతూ.. సత్యసాయి దవాఖాన పిల్లల పాలిట సంజీవనిగా నిలిచిందన్నారు. సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ హార్ట్ కేర్ రీసెర్చ్ సెంట ర్ అభివృద్ధి చెందుతూ ప్రపంచస్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. పిల్లల ఆపరేషన్లు చేయడం కష్టతరమైన పని అని, అటువంటి సర్జరీలు చేస్తున్న వైద్యులను అభినందించాడు. దేశంలో సత్యసాయి దవాఖానల్లో సుమారు 34 వేల గుండె ఆపరేషన్లు చేయడం గొప్ప విషయమన్నారు. ఇక్కడ దవాఖాన ఏర్పాటు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు. కార్యక్రమంలో రిటైర్డు ఐఏఎస్ అధికారి చక్రపాణి, దవాఖాన చైర్మన్ శ్రీనివాస్, డాక్టర్ రాగిని, డాక్టర్ స్వప్న, దుర్గ వడ్లమూడి, జగన్నాథ శర్మ, గణేశ్ పాల్గొన్నారు.