మెదక్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో విద్యను అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై బడులు కొనసాగుతున్నాయి. కానీ, మౌలిక వసతుల లేమి, సరిపడా ఉపాధ్యాయులు లేక సర్కారు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. కనీసం మండల విద్యాశాఖ అధికారులను నియమించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాల పునర్విభజన అనంతరం మెదక్ జిల్లాలో ఒక్కరూ కూడా పూర్తిస్థాయి ఎంఈవో లేకపోవడం గమనార్హం. మెదక్ జిల్లాలో మొత్తం 871 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 607, ఉన్నత పాఠశాలలు 124, జడ్పీహెచ్ఎస్లు 140 ఉన్నాయి. వీటితో పాటు గురుకుల పాఠశాలలు 2, కేజీబీవీలు 15, ప్రైవేట్ పాఠశాలలు 118 ఉన్నాయి.
ఎంఈవోగా మండలానికి ఒకరు ఉండాలి. కానీ, ఏ ఒక్క మండలానికి నేటికీ పూర్తిస్థాయి మండల విద్యాధికారి లేకపోవడం గమనార్హం. మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉండగా.. సీనియర్ హెచ్ఎంలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వారికి కూడా అదనంగా ఒకరికి ఏడు మండలాలు అప్పగించారు. వారు రెగ్యులర్ హెచ్ ఎం బాధ్యతలు నిర్వర్తిస్తూనే అదనంగా ఎంఈవో విధులు నిర్వర్తిస్తున్నారు. మెదక్ ఎంఈవోగా పనిచేస్తున్న నీలకంఠంకు మెదక్, పాపన్నపేట, హవేళీఘనపూర్, కొల్చారం, టేక్మాల్, రామాయంపేట, నిజాంపేట బాధ్యతలు అప్పగించారు. చిన్నశంకరంపేట ఎంఈవో బుచ్యానాయక్కు నర్సాపూర్, శివ్వంపేట్, కౌడిపల్లి, చిన్నశంకరంపేట, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్, నార్సింగి, చేగుంట మండలాల బాధ్యతలు చూస్తున్నారు. వెల్దుర్తి ఎంఈవో యాదగిరికి వెల్దుర్తి, మాసాయిపేట మండలాలు చూస్తున్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సైతం సెక్టోరియల్ అధికారుల పరిస్థితి అలాగే ఉంది. సెక్టోరియల్ అధికారులను అదనపు బాధ్యతల నిమిత్తం సీనియర్ హెచ్ఎంలను నియమించారు. ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టిసారించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేసి సర్కారు విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్ల్లిష్ మీడియంలోనే బోధన చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం ఇంగ్లిష్ బోధన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. క్షేత్రస్థాయిలో ఎంఈవోలు లేకపోవడంతో పర్యవేక్షణ కరువైంది.రెగ్యులర్ ఎంఈవోలు లేక ఉపాధ్యాయులపై పర్యవేక్షణ లేకుండా పోయింది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారింది.
మెదక్ జిల్లాలో 15 ఎంఈవో పోస్టులు భర్తీ చేయాల్సి ఉం ది. సర్వీస్ రూల్స్ అడ్డంకిగా మారాయి. ఈ సమస్య ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. గతంలో ఎంఈవోలుగా ఉన్న వారితోనే కొనసాగిస్తున్నాం. ఒక్కో ఎంఈవోకు ఏడు నుంచి 12 మండలాల బాధ్యతలను అప్పగించాం.