జహీరాబాద్, అక్టోబర్ 25: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లోని కస్తుర్బాగాంధీ గురుకుల బాలికల పాఠశాలలో వైరల్ ఫీవర్తో తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురు, శుక్రవారాల్లో విద్యాన్థినులు తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడగా ఉపాధ్యాయలు, సిబ్బంది స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యాధికారులు విద్యార్థులను పరీక్షలు చేశారు. విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వెంటనే 108 వాహనంలో జహీరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. 13 మంది విద్యార్థినులు దవాఖానలో చికిత్స పొందుతున్నారని కస్తుర్భా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రుబీనా పర్వీన్బేగం తెలిపారు.
డీఈవో వెంకటేశ్వర్లు, జిల్లా కమ్యూనిటీ మొబిలైజైషన్ అధికారి వెంకటేశం, జిల్లా బాలిక విద్యాభివృద్ధి అధికారి మాధవి, ఎంపీడీవో రాజశేఖర్, ఎంపీవో సురేశ్, ఎంఈవో మారుతీరాథోడ్ గురుకుల పాఠశాలను సందర్శించారు.
విద్యార్థినులు తీవ్ర అసవస్థకు గురైతే ఎందుకు సమాచారం ఇవ్వలేదని సిబ్బందిపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెమో జారీ చేయాలని జిల్లా బాలికల విద్యాభివృద్ధి అధికారి మాధవిని ఆదేశించారు. అనంతరం పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులతో మాట్లాడారు.
అధైర్యపడవద్దని, సమస్యలుంటే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సిబ్బందికి అధికారులు ఆదేశించారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈవో వెంకటేశ్వర్లు సందర్శించి విద్యాబోధన, మధ్యాహ్న భోజనం తదితర వివరాలు పరిశీలించారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంపై న్యాల్కల్ పీహెచ్సీ వైద్యాధికారి అమృత్రాజ్ను విలేకరులు అడగగా, వైరల్ ఫీవర్తో విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.