శివ్వంపేట, ఆగస్టు 12: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలలో కొన్ని సమస్యలు నెలకొన్నాయి. 25 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాల లు వేరువేరుగా ఉంటాయి. గిరిజన పాఠశాలలో బాల బాలికలతో కలసి 306 మంది విద్యార్థులు ఉంటారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యను బోధిస్తున్నారు. 10మంది రెగ్యులర్, 15 మంది పార్ట్‌టైం ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ హాస్టల్ విద్యను అభ్యసించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తుంటారు.
ఇంటర్మీడియట్ విషయానికొస్తే మొత్తం 203 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 11మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేస్తున్నారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎఅండ్టీ కోర్సులు ఉన్నాయి. పూర్తిస్థాయి సిబ్బంది, మైదానం ఉన్నప్పటికీ విద్యార్థులు పడుకునే గదులు కొంత ఇరుకుగా ఉన్నా యి. ఆ గదుల్లో ఉండే కిటికీలకు దోమతెరలు లేకపోవడంతో దోమల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు అందరూ ఒకే దగ్గర కింద కూర్చొని భోజనం చేస్తున్నారు.
వంట సిబ్బంది ఉన్నప్పటికీ విద్యార్థులే తోటి విద్యార్థులు భోజనం వడ్డిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్లేట్లు శుభ్రం చేసుకునే ట్యాంకు వద్ద పిచ్చిగడ్డి, మురుగు పేరుకుపోయాయి. దీం తో విద్యార్థులు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. మరుగుదొడ్లు, టాయిలెట్లు, అదనపు తరగతి గదులు, నివాస గదులు, నూతన తలుపులు, కిటికీలు, లైబ్రరీ పుస్తకాలు వంటి సమస్యలు ఉన్నాయి.
గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాల సమస్యలపై ఈనెల 1న గురుకులం సెక్రటరీ సీతాలక్ష్మి దృష్టికి తీసుకెళ్లాం. మరుగుదొడ్లు, టాయిలెట్లు, అదనపు తరగతి గదులు, నివాస గదులు, నూతన తలుపు లు, కిటికీలు, లైబ్రరీ పుస్తకాలు వంటి అవసరాలు ఉన్నాయని, ఈ సమస్యలపై చర్యలు తీసుకోవాలని సెక్రటరీకి విన్నవించాం.
-బలరామ్‌నాయక్,గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్, నర్సాపూర్, మెదక్ జిల్లా