నారాయణఖేడ్, నవంబర్ 14: నారాయణఖేడ్‌లోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థిని మాధవి గురువారం హాస్టల్ భవనం మొదటి అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో బాలికను హుటాహుటిన నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి సర్కార్ దవాఖానకు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామానికి చెందిన మాధవి నారాయణఖేడ్‌లోని హాస్టల్లో ఉంటూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.
దసరా సెలవుల నేపథ్యంలో ఇంటికి వెళ్లి తిరిగి గత మంగళవారం హాస్టల్‌కు వచ్చి గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాలిక నడుముకు బలమైన గాయం కావడంతో లేవలేని స్థితిలో ఉంది. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ రజితను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. ఇంటి నుంచి మంగళవారం హాస్టల్‌కు వచ్చిన విద్యార్థిని మరుసటి రోజు కనిపించకుండా పోయిందని, బాలిక కోసం ఆరా తీస్తున్న క్రమంలోనే బీదర్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు అక్కడి పోలీసులు సమాచారం ఇవ్వడంతో తాము రాత్రి అక్కడికి వెళ్లి బాలికను తీసుకువచ్చినట్లు తెలిపారు. బాలిక తరచూ మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నదని, ఆ కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని కుటుంబీకులు చెప్పినట్లు వార్డెన్ పేర్కొన్నారు. మరోవైపు తనను ఎవరో కిడ్నాప్ చేసి పటాన్చెరు అక్కడి నుంచి బీదర్ తీసుకెళ్లారని, తాను తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నానని విద్యార్థిని చెప్పడం గమనార్హం.