జగదేవపూర్, ఆగస్టు 29: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్‌లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. వివరాలు.. యశ్వంత్‌కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూరుపల్లెలో వైద్యం చేయించారు. పరిస్థితి విషమించి గురువారం అర్ధరాత్రి యశ్వంత్ చనిపోయాడు. కిష్టయ్యకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు యశ్వంత్ కుకునూరుపల్లె పాఠశాలలో చదువుతున్నాడు. గతంలో తిమ్మాపూర్ మధిర గ్రామంగా అనంతసాగర్ ఉండేది. బీఆర్ఎస్ హయాంలో అనంతసాగర్ కొత్త పంచాయతీగా ఏర్పడింది.
తిమ్మాపూర్, అనంతసాగర్ గ్రామాలు పక్కపక్కనే ఉంటా యి. ఈ రెండు గ్రామాల్లో వారం వ్యవధిలో కొంతం మహేశ్, శ్రావణ్‌కుమార్ అనే ఇద్దరు డెంగీతో మృతిచెందగా, గురువారం రాత్రి యశ్వంత్ మృతితో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ రెండు గ్రామాల్లో సుమారు రెండు వందల మందిపైనే విషజ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో కొందరు ట్రీట్మెంట్ తీసుకోగా, కొంతమంది ఇతర చోట ప్రైవేట్ దవాఖానల్లో చేరారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా అధికారులు సందర్శించి గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పటికీ విష జ్వరాలు అదుపులోకి రావడం లేదు.
జగదేవపూర్, ఆగస్టు 29: పల్లెల్లో విషజ్వరాలు ప్రబలి పసిప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలంలోని అనంతసాగర్‌లో డెంగీతో మృతిచెందిన యశ్వంత్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మా ట్లాడుతూ.. బాలుడు యశ్వంత్ మృతితో ఆ కుటుంబానికి తీరని దు:ఖం నెలకొందన్నారు.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో తిమ్మాపూర్, అనంతసాగర్ గ్రామాల్లో చెత్తా చెదారంతో పాటు రోడ్లపై మురుగు నిలిచి విషజ్వరాలు ప్రబలుతున్నాయని, 200 మంది విషజ్వరాలతో బాధ పడుతుండగా, పలువురు గజ్వేల్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో రెండు గ్రామాల్లో ముగ్గురు మరణించారని తెలిపారు. విషజ్వరాల తీవ్రతకు ఇది అద్దం పడుతుందన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రెండు గ్రామాల్లో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రజలు కోలుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచులు లావణ్య మల్లేశం, సుమన్, కుమార్, స్వామి, వెంకటనర్సు ఉన్నారు.