పటాన్చెరు, జూలై 27: మూడో అంతస్తు నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని పడి తీవ్రంగా గాయపడిన ఘట న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలో చోటు చేసుకుంది. విద్యార్థిని తండ్రి మహిపాల్‌రెడ్డి వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బ సంత్పూర్ గ్రామానికి చెందిన అర్చన (16)ను పటాన్చెరు మండలం ముత్తంగిలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల, కళాశాలలో నెల రోజుల క్రితం జాయిన్ చేశారు.
శనివారం తెల్లవా రుజామున ఐదుగంటలకు తండ్రికి గురుకులం ఉపాధ్యాయులు ఫోన్ చేసి కుమార్తె మూడో అంతస్తు నుంచి పడి తీవ్రగాయాలకు గురైందని సమాచారం ఇచ్చారు. పటాన్చెరు ఏరియా దవాఖానలో చికిత్సకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అర్చనను మెరుగైన చికిత్సకోసం సంగారెడ్డి దవాఖానకు తరలించా రు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులకు డాక్టర్లు గాంధీ దవాఖానకు తరలించాలని సూచించారు. డాక్టర్ల సూచనల మేరకు అర్చనను హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తీసుకెళ్లారు.
అక్కడ స్కా నింగ్‌లో వెన్నెముక్కకు తీవ్రగాయాలైనట్లు ప్రాథమిక రిపోర్టులు వచ్చాయన్నారు. మూడో అంతస్తు నుంచి ఎలా పడిందో గురుకు లం సిబ్బంది సరిగ్గా వివరాలు చెప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. వారం క్రితం ఇంటికి వస్తానని చెబితే గురుకులం సిబ్బంది అనుమతి ఇవ్వలేదన్నారు. అర్చనకు మెరుగైన చికిత్స చేయించాలని కేవీపీఎస్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. చికిత్సపొందుతున్న అర్చనను ఆయన పరామర్శించి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆయన కోరారు.