నయా ట్రెండ్
రామచంద్రాపురం, మే 10 : మార్కెట్లో ప్రస్తుతం స్టోన్, వన్ గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్లు ట్రెండ్ నడుస్తున్నది. చీరలకు మాచింగ్‌గా స్టోన్ ఆర్నమెంట్లు దొరుకుతుండడంతో మహిళలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీంతో స్టోన్, వన్‌గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్లు కొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. స్టోన్ ఆర్నమెంట్లు, వన్‌గ్రామ్ గోల్డ్ సెట్లు వచ్చిన తర్వాత మహిళలకు బంగారు ఆభరణాలపై ఆసక్తి తగ్గింది. మధ్య తరగతి మహిళల నుంచి సంపన్నుల వరకు ప్రస్తుతం ఇదే ట్రెండ్ కొనసాగుతున్నది. ఆర్నమెంట్లు మార్కెట్లో అనేక రకాల డిజైన్లలో లభిస్తున్నాయి. చాలావరకు మహిళలు స్టోన్ ఆర్నమెంట్స్, వన్‌గ్రామ్ గోల్డ్ సెట్లు ధరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
స్టోన్ ఆభరణాలపై మక్కువ
స్టోన్ ఆభరణాలపై మధ్య తరగతి మహిళల నుంచి సంపన్నుల వరకు మక్కువ పెంచుకుంటున్నారు. స్టోన్ ఆభరణాల్లో చాలా రకాలున్నాయి. ఒక్కో స్టోన్ ఆర్నమెంట్ లైన్‌కు రూ.3,500 నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది. స్టోన్ క్యారెట్‌ని బట్టి రేట్లు ఉన్నాయి. ఒక్కో క్యారెట్‌కు రూ.35 నుంచి రూ.150 వరకు ఉంటుంది. ఇందులో సిల్వర్ స్టోన్, సీజెడ్ స్టోన్, రూబీస్ స్టోన్, మల్టీ స్టోన్, యాంటింగ్ స్టోన్ ఇలా ఐదు రకాలున్నాయి. మహిళల చీరల రంగులు కలిసేలా స్టోన్ ఆర్నమెంట్లు తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ పట్టణాలతో పాటు పల్లెలకూ వాకింది. స్టోన్స్‌ను బాంబే, కోల్‌కత, జైపూర్, సూరత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులోనే ఇమిటేషన్ బీట్స్ కూడా ఉంటాయి. వీటి ధర రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. వీటిని మధ్యతరగతి మహిళలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
ముత్యాల ఆభరణాలకు పెరిగిన డిమాండ్
స్టోన్స్‌తో పాటు ముత్యాల ఆభరణాలకూ డిమాండ్ ఉంది. రూ.1000 నుంచి రూ.10 వేల వరకు ముత్యాల ధరలు ఉన్నాయి. స్వాతిముత్యాలు, హైద్రాబాద్ ముత్యాలు, సౌసిపల్స్ ముత్యాలు, పగడాలు ఇలా నాలుగు రకాల ముత్యాలు ఉంటాయి. ముత్యాల ఆభరణాలు కూడా మహిళలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వన్‌గ్రామ్ గోల్డ్ జ్యూవెల్లరీ సెట్లకు సంబంధించి మ్యాట్, పొల్కి, సీజెడ్, ప్లాటినమ్, టెంపుల్, కుందన్, సిల్వర్ జ్యువెల్లరీ సెట్లకు డిమాండ్ ఉంది. వీటి ధర రూ.1500 నుంచి రూ.20 వేల వరకు ఉంది.
విలువైన స్టోన్స్..
అమెరికన్ డైమండ్స్ అతివిలువైనవి. వీటిని డైమండ్స్ ఆకారంలో మిషన్‌లో కట్ చేసి ఆకర్షణీయంగా తయారు చేస్తారు. మహిళలకు వీటి ద్వారా ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ డైమండ్స్ వాడకం ఎంతో శ్రేయస్కరం. ఒక్కో అమెరికన్ డైమండ్ ధర రూ.వెయ్యి నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది.
ప్లాటినం డైమండ్స్..
ప్లాటినం డైమండ్స్ నెక్లెస్‌లో ఎక్కువగా వాడుతారు. డైమండ్ నెక్లెస్‌లు మంచి ఆకర్షణనిస్తాయి. ఒక్కో ప్లాటినం డైమండ్ ధర రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది.
అన్కడ్ డైమండ్స్..
అన్కడ్ డైమండ్స్‌ను మధ్య తరగతి మహిళలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. వీటి ధర రూ.2500 నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఈ డైమండ్స్‌లో షైనింగ్ తక్కువగా ఉన్నప్పటికీ మహిళల మెడలో మంచి అందాన్నిస్తాయి.
వందకు పైగా డిజైన్లున్నాయి..
మహిళలకు కావాల్సిన వందకు పైగా డిజైన్స్‌లో ఆభరణాలు లభిస్తున్నా యి. పెండ్లిళ్లు, పండుగ ల సీజన్లో స్టోన్ ఆర్నమెంట్స్, వన్‌గ్రామ్ గోల్డ్ వ్యాపారం బాగా జరుగుతున్నది. స్టోన్ ఆర్నమెంట్స్ ధరలు రూ.3,500 నుంచి రూ. 10వేల వరకు ఉంటే, వన్‌గ్రామ్ గోల్డ్ రూ.1,500 నుంచి రూ.20 వేలు ఉన్నాయి. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తున్నది.
– శ్రావణ్, దుకాణం యజమాని, ఆర్సీపురం