జహీరాబాద్/ఝరాసంగం, డిసెంబర్ 21: మండలకేంద్రమైన ఝరాసంగానికి వెళ్లే ప్రధాన రోడ్డును విస్తరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని జహీరాబాద్ ఎమ్మె ల్యే కొనింటి మాణిక్రావు కోరారు. శనివారం హైదరాబాద్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులకు ఇలవేల్పుగా, కోరిన కోర్కెలు తీర్చే కేతకీ సంగమేశ్వర స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తుంటారన్నారు. నిమ్జ్ ప్రాజెక్టు కూడా మండలంలోనే ఉండడం, పలు ఐటీ పరిశ్రమలు ఏర్పాటు కానుండడంతో పారిశ్రామిక వేత్తలు, సంబంధిత అధికారులు వస్తుంటారని పేర్కొన్నారు. మండల కేంద్రానికి ప్రధాన రోడ్డు మార్గం గుండానే రాకపోకలు సాగించే అవకాశం ఉందని, ఉన్న రోడ్డుపై గుంతలు పడడం, రద్దీ కూడా ఎక్కవగా ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
ఇరుకుగా ఉన్న రోడ్డును విస్తరించి, బాగు చేసేందుకు రూ.5 కోట్ల నిధులను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డు ఇరువైపుల ఉన్న విద్యుత్ స్తంభాలతో ఇబ్బందిగా ఉందన్నారు. రోడ్డు విస్తరణకు వెంటనే తగు చర్యలు తీసుకోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు, పారిశ్రామిక వేత్తలు, అధికారులకు ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.