పటాన్చెరు రూరల్, అక్టోబర్ 14: పౌర సేవల్లో జవాబుదారితనం పెంచుతామని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి అన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌరసేవా కేంద్రాన్ని మంగళవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి యూనిఫామ్‌లు అందజేశారు. అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం, సమీకృత అభివృద్ధి కోసం నూతనంగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నూతన మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ. 15కోట్ల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు రూ. 1400 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించిందన్నారు. 2047 విజన్ ప్రణాళికలో భాగంగా అభివృద్ధి చెందుతున్న పంచాయతీలను మున్సిపాలిటీలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2011 జనాభా లెక్కల్లో 47శాతం ప్రజలు అర్బన్ ప్రాంతంలో ఉండేవారన్నారు, 2025లో 53శాతం ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారని అంచనా ఉందని తెలిపారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గంలో ఎనిమిది మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు.
మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి ఫల్గున కుమార్, ఇస్నాపూర్ మున్సిపల్ కమీషనర్ వెంకట్ కిషన్‌రావు, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, సీనియర్ నాయకులు దశరథరెడ్డి, శ్రీశైలం, వెంకట్‌రెడ్డి, శోభాకృష్ణారెడ్డి, మల్లారెడ్డి, క్రిష్ణయాదవ్, చందు, యాదగిరి. పటాన్చెరు సీఐ వినాయక్‌రెడ్డి, అధికారులు ప్రవీణ్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.