జహీరాబాద్, జనవరి 4: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులో స్వయంభూగా వెలిసిన సిద్ధివినాయకుడి కల్యాణోత్సవం శనివారం కమనీయంగా జరిగింది. స్వామివారి 225వ జయంతోత్సవాల ముగింపును పురస్కరించుకుని కంచి కామకోటి పీఠం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం ఆలయంలో స్వామివారికి వేదపండితులు అభిషేకం, మహామంగళ హారతి తదితర పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ ప్రాంగణంలో పచ్చని పందిళల్లో వివిధ రకాల పుష్పాలతో వేదికను ఏర్పాటు చేశారు.
మంగళ వాయిద్యాల మధ్య ఆలయ గర్భగుడి నుంచి వేదిక వరకు ఆలయ కమిటీ సభ్యులు వినాయకుడితో పాటు సిద్ధి, బుద్ధి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆనంతరం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా బుద్ధి, సిద్ధిలతో సిద్ధివినాయక స్వామికి కల్యాణాన్ని కనుల పండువుగా జరిపించారు. కల్యాణం అనంతరం మహిళలు అమ్మవార్లకు ఒడిబియ్యాన్ని పోసి, కట్న కానుకలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఎస్పీ చెన్నూరి రూపేశ్ దంపతులతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఉత్సవాల్లో ఆలయ గౌరవ అధ్యక్షుడు అల్లాడి వీరేశం, ఆలయ కమిటీ అధ్యక్షుడు రేజింతల్ అశోక్, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింహులు, రేజింతల్, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింహులు, ఉపాధ్యక్షుడు నీల రాజేశ్వర్, ఉల్లిగడ్డ బస్వరాజ్, సంయుక్త కార్యదర్శులుగా చిద్రి లక్ష్మణ్, కల్లచంద్రశేఖర్, కోశాధికారిగా డిగంబర్ పోలా, కార్యనిర్వహకులు కోబ్బజీ రవికుమార్, సభ్యులు సంగమేశ్వర్, దీపక్జోషి, చంద్రశేఖర్, మేనేజర్ కృష్ణ,అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.