పాపన్నపేట, సెప్టెంబర్ 26: మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు శుక్రవారం స్కందమాత (మహాలక్ష్మి దేవి)గా దుర్గమ్మ దర్శనమిచ్చారు. వేద పండితులు రాజగోపురంతో పాటు గోకుల్ షెడ్లో అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
భక్తులకు అన్నదానం చేశారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కలెక్టర్ రాహుల్‌రాజ్ అమ్మవారిని దర్శించుకున్నారు. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేయడంతో మంజీరా నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో ఏడుపాయల అమ్మవారి ఆలయం మూసివేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఘనపూర్ ఆనకట్టపై నుంచి నింజాంసాగర్ వైపు 88వేల పైచిలుకు క్యూసెక్కుల వరద పరుగులు తీసింది. దీంతో ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.