మెదక్ అర్బన్, మార్చి18: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది సిద్ధ్దం కావాలని మెదక్ ఎస్పీ డాక్టర్ బాలస్వామి సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో కొత్త సవాళ్లు ఎదురవుతాయని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. నేరాల చరిత్ర ఉన్నవారు, రౌడీషీటర్లు, ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి జాబితా సిద్ధ్దం చేసుకోవాలన్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అధికారుల ఎదుట బైండోవర్ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన వారి వివరాలు సేకరించాలన్నారు. నగదు, మద్యం అక్రమ రవాణా, అనుమానిత వాహనాల తనిఖీ, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ పక్కాగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) మహేందర్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.