నర్సాపూర్, ఫిబ్రవరి26: బాజా సే ఇండియా-2026 (బగ్గీల) పోటీలు బి వి ఆర్ ఐ టి ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమని ఎస్పీ డి.వి శ్రీనివాస రావు కొనియాడారు. గురువారం నర్సాపూర్ పట్టణ సమీపంలోని బి వి ఆర్ ఐ టి కళాశాలలో మెకానికల్ బాజా సే ఇండియా- 2026 మొదటి రోజు ఈవెంట్లో భాగంగా బగ్గీల టెక్నికల్ విషయాలపై విస్తృత స్థాయి పరిశీలనలు జరిగాయి. బాజాసే ఇండియా జాయింట్ కన్వీనర్ డా.వి. మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అడిషనల్ ఎస్పీ మహేందర్ తో కలిసి శ్రీనివాసరావు హాజరై జెండా ఊపి బగ్గీలకు బ్రేక్ టెస్ట్, టెక్నికల్ ఇన్స్ఫెక్షన్, స్టాటిక్ ఈవెంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి పోటీలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చూపిస్తాయన్నారు.
ఉద్యోగ కల్పన కోసం ఖర్చుకు వెనకాడకుండా ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ గొప్పతనాన్ని ప్రశంసించారు. మెకానికల్ బాజా సే ఇండియా కన్వీనర్ అలీ సయ్యద్ మాట్లాడుతూ గురువారం నాడు టెక్నికల్ ఇన్స్పెక్షన్, బ్రేక్ టెస్ట్, స్టాటిక్ ఈవెంట్లు – డిజైన్, సీఏఈ, ద్రోణాచార్య ఈవెంట్, వాలిడేషన్ ఈవెంట్, డైనమీక్ ఈవెంట్లు, స్లెడ్ ఫుల్ ఈవెంట్ తదితర ఈవెంట్లను నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఈ సీజన్లో నూతనంగా హోండా జీఎక్స్ 430 ఇంజిన్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ జట్లు ప్రతిభ కనబరచాయని, 10 ప్రతిభావంతమైన జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయని అన్నారు.
ఇవే కాకుండా మార్చి 2,3వ తేదిల్లో బీవీఆర్పటీ ఆధ్వర్యంలో హెస్ఆర్ మీట్ నిర్వహించి పరిశ్రమ నిపుణులతో పరిచయాలు, ఉద్యోగ అవకాశాలు, స్పాట్ ఆఫర్లు వంటి విలువైన అవకాశాలు ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థిని, విద్యార్థులకు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బాజా సే ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బాల్రాజ్ సుబ్రమణ్యం, అడ్వైజర్ డా.కె.సి ఓరా, ప్రిన్సిపాల్ సంజయ్ దూబే, డైరెక్టర్ డా. లక్ష్మీప్రసాద్, బాజా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.