సంగారెడ్డి, మే 27: జిల్లాలో ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు పోలీసు యంత్రాంగం పని చేస్తున్నదని, అందుకోసమే మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. సోమవారం పట్టణంలోని నటరాజ్ థియేటర్ ఎదుట మై ఆటో ఈజ్ పేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, ఆటోల్లో ప్రయాణించే వారికి పూర్తి భద్రత, భరోసా కల్పించడమే పోలీసుల లక్ష్యమని వివరిస్తూ ఆటోలకు స్టిక్కర్లు అంటించారు. అంతకుముందు ఆటో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించొద్దని డ్రైవర్లకు సూచించారు.
ఆటో ఎక్కగానే ప్రయాణికులు డ్రైవర్ వెనకాల అంటించిన స్టిక్కర్‌ను ఫొటో తీసి పెట్టుకోవాలని సూచించారు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే వెంటనే ఆ ఫొటోను పోలీస్‌స్టేషన్‌కు లేదా షీ టిమ్‌కు పంపించాలన్నారు. వెంటనే పోలీసులు చర్య తీసుకుంటారన్నారు. రాత్రి సమయాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి దగ్గర అధిక మొత్తం వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని సబ్ డివిజన్ ప్రాంతాల్లో దాదాపు 2 వేలకు పైగా ఆటోలు ఉన్నాయని, నిత్యం నడుస్తున్న ఆటోల వివరాలు పోలీసులు సేకరించారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవ్‌రావ్, డీఎస్పీలు సత్తయ్యగౌడ్, రవీందర్‌రెడ్డి, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్, పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రవణ్, టౌన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు.