అందోల్, అక్టోబర్ 19 : కనిపెంచిన పాపానికి కన్నతల్లిని కడతేర్చారు తనయులు. జీవిత చరమాంకంలో తల్లిని కంటికి రెప్పలా కాపాడి ఆమెను సంతోషంగా చూసుకోవాల్సింది పోయి, పోషణ విషయంలో గొడవపడి కర్రలతో కొట్టి గొంతునులిపి చంపేసి, ఆ తర్వాత సహజమరణంగా చిత్రీకరించే క్రమంలో కటకటాల పాలయ్యారు తనయులు. కన్నతల్లిని కొడుకులే కడతేర్చిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్వెల్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది. హత్యకు సంబంధించిన విషయాలను ఆదివారం జోగిపేటలో సీఐ అనిల్‌కుమార్, వట్పల్లి ఎస్సై లవకుమార్ వెల్లడించారు.
వట్పల్లి మండలం మర్వెల్లికి చెందిన చాకలి బసమ్మ(80) కొడుకుల వద్దే ఉండేది. ఈమె పోషణ విషయంలో కొడుకులు కొద్దిరోజులుగా గొడవ పడుతున్నారు. కొద్దినెలల క్రితం బసమ్మపై దాడిచేసి చంపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆమె ఇంటి అరుగుమీద పడుకున్న సమయంలో కిందపడి గాయాలు అయ్యాయని అందరినీ నమ్మించి దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈనెల 4న మృతిచెందింది. కొడుకు బషయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన ఎస్సై లవకుమార్ కేసును సీరియస్‌గా తీసుకున్నారు.
అసహజ మరణంగా నమోదైన కేసును హత్యకేసుగా మార్చి మృతురాలి కొడుకుల కదలికలపై నిఘా పెట్టి పూర్తి వివరాలు సేకరించారు. శనివారం రాత్రి సీఐతో కలిసి మర్వెలికి వెళ్లి నిందితులును అదుపులోకి తీసుకుని విచారించగా, తల్లి పోషణ విషయంలో గొడవలు రావడంతో అందరం కలిసి మద్యం తాగి కర్రలతో కొట్టి, గొంతునులిపి తల్లిని హత్యచేసినట్లు అంగీకరించారు. తల్లిని హత్యచేసిన కొడుకులు బషయ్య, అంబయ్య, వెంకయ్య, నర్సింహులు, మోహన్, మనమడు రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులకు శిక్షపడేలా చేసిన వట్పల్లి ఎస్సై లవకుమార్, సిబ్బందిని సీఐ అభినందించారు.