పటాన్చెరు, డిసెంబర్ 20: రోజూ మద్యం తాగి కుటుంబసభ్యులను వేధిస్తున్న కుమారుడిపై ఆగ్రహంతో తండ్రి కర్రతో దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొడుకు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా క్యాసారంలో చోటు చేసుకుంది. బీడీఎల్ సీఐ స్వామిగౌడ్ వివరా ల ప్రకారం..క్యాసారం గ్రామానికి చెందిన అతెల్లి అనంత్‌రెడ్డి కుమారుడు అతెల్లి వెంకట్‌రెడ్డి(34) మద్యానికి బానిస అయ్యాడు.
రోజూ తాగి వచ్చి తల్లితోపాటు తండ్రిపై దౌర్జ న్యం చేసేవాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద తాగి వచ్చి కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. కొడుకు తీరుతో ఆగ్రహం చెందిన తండ్రి అనంత్‌రెడ్డి కర్రతో కుమారుడి తలపై బలంగా కొట్టాడు. దీంతో తలపగిలి తీవ్రగాయాలకు గురై వెంకట్‌రెడ్డి ఘట నా స్థలంలోనే కుప్పకూలి మృతి చెందాడు.
మృతుడు వెంకట్‌రెడ్డి గతంలోనూ తల్లిపై తాగివచ్చి గొడవకు దిగినప్పుడు కేసు నమోదైంది. జైలు శిక్ష సైతం అనుభవించాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మారలేదు. ఈ హత్య క్యాసారంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్టుమా ర్టం నిమిత్తం పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించారు.