విద్యుత్ బిల్లుల భారం తగ్గించడం, నాణ్యమైన కరెంట్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సోలార్ పవర్‌ను ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఇండ్లకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాకు 350 యూనిట్లు మంజూరు చేయగా, పైలెట్ ప్రాజెక్టు కింద 10 మండలాలను ఎంపిక చేశారు. సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు స్త్రీ నిధి పథకం ద్వారా రుణం అందించనుండగా, 30శాతం వరకు రాయితీ లభించనున్నది. ఇంటి అవసరాలకు సరిపోగా మిగులు విద్యుత్‌ను నెట్ మీటర్ సాయంతో గ్రిడ్‌కు సరఫరా చేసి, ట్రాన్స్ కోకు విక్రయించుకునే అవకాశం ఉంది. సోలార్ ప్యానల్స్‌కు 25 సంవత్సరాలు, యూనిట్ మొత్తానికి ఐదేండ్ల వారంటీ ఉంటుంది. ఈ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తే త్వరలోనే జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అమలుచేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మెదక్, మార్చి5 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల మహిళల ఇండ్లకు సౌర విద్యుత్ యూనిట్లు మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ప్రతి నెలా విద్యుత్ బిల్లులు అధికంగా రావడం, పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారుతున్నది. ఎవరి ఇండ్లపై వారు తమకు అవసరమైన సామర్థ్యం మేరకు సౌర పలకలు ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో సభ్యులకు స్త్రీనిధి కింద రుణ సదుపాయాన్ని కల్పించనున్నారు.
జిల్లాలో 10 మండలాలు ఎంపిక
జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. ఇందులో పైలట్ ప్రాజెక్టు కింద 10 మండలాల్లో ఈ సోలార్ యూనిట్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఒక్కో మండలానికి 35 యూనిట్ల చొప్పున మొత్తం 350 యూనిట్లు ఇవ్వనున్నారు. మహిళా సంఘాల సభ్యులకు 2 లేదా 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పలకలను రాయితీపై మంజూరు చేసి ఇంటిపై ఏర్పాటు చేస్తారు. రెండు కిలోవాట్ల సౌర విద్యుత్ యూనిట్ ద్వారా రోజు 8 నుంచి 12 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నెలకు 150 నుంచి 250 యూనిట్ల వరకు విద్యుత్ ఖర్చు చేసే మధ్య తరగతి కుటుంబాలు 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. యూనిట్ల ఏర్పాట్లలో భాగంగా విద్యుత్ అధికారులు నెట్ మీటరు అమర్చుతారు. అవసరం కంటే అధికంగా ఉత్పత్తి అయితే దానికి నెట్ మీటరు సాయంతో గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. మిగులు విద్యుత్‌ను ట్రాన్స్ కో కొనుగోలు చేస్తుంది.
సోలార్ వల్ల లాభాలు
విద్యుత్ వినియోగ బిల్లుల్లో తగ్గుదల, నిర్వహణ ఖర్చు ఉండదు. ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసి అవసరానికి వాడుకోవచ్చు. పెట్టుబడి 5 ఏళ్లలో తీరిపోతుంది. సోలార్ ప్యానల్‌కు 25 ఏళ్లు, యూనిట్‌కు 5 ఏళ్ల వారంటీ ఉంటుంది. పొదుపు సంఘంలో సభ్యురాలిగా నమోదై ఉండాలి. నెలకు విద్యుత్ బిల్లు కనీసం రూ.200 పైగా రావాలి. ఇంటిపైన శ్లాబు ఇల్లు అయి ఉండి, సుమారు 160 నుంచి 200 చదరపు అడుగులు ఉండాలి. 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు విలువ రూ.1,42,200 అవుతుంది. ఇందులో రాయితీ 42,200 లభిస్తుంది. దీనిపై రూ.లక్ష రుణం లభిస్తుంది. 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు విలువ రూ.1,92360 అవుతుంది. ఇందులో రాయితీ 57360 లభిస్తుంది. దీనిపై రూ.1.25 లక్షల రుణం లభిస్తుంది. బ్యాంకులో రుణ బకాయిలు ఉండకూడదు.
జిల్లాకు 350 యూనిట్లు
మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మెదక్ జిల్లాలో 10 మండలాలు ఎంపికయ్యాయి. ఒక్కో మండలానికి 35 యూనిట్లు మంజూరయ్యాయి. ఔత్సాహికులకు రూ.1.25 లక్షల వరకు స్త్రీ నిధి ద్వారా రుణ సదుపాయం కల్పిస్తాం. సోలార్ యూనిట్ల ఏర్పాటుపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. యూనిట్ వారంటీ ఐదేళ్ల వరకు ఉంటుంది.
– గంగారాం, స్త్రీ నిధి ఆర్ఎం, మెదక్