కొండపాక, నవంబర్ 22 : కొండపాక మండల పరిధిలోని దుద్దెడ గ్రామ శివారులోని నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో రాజీవ్ రహదారిపై సోమవారం ఓ బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పొన్నాల గ్రామానికి చెందిన నక్క మల్లయ్య, వార్డు యాదగిరి, నల్ల అశోక్ కలెక్టరేట్ కార్యాలయానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు.
కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు మలుపు తీసుకుంటున్న సమయంలో వీరి ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లయ్య, యాదగిరికి తీవ్ర గాయాలు కాగా కలెక్టరేట్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న అశోక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కొండపాక 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.