
జహీరాబాద్, జూలై 6: రాష్ట్ర ప్రభుత్వం చదువు కోసం విద్యార్థులపై పెట్టుబడి పెడుతున్నది.. ఆ పెట్టుబడే.. రేపు రాష్ర్టానికి ఆదాయం ఇస్తుంది’.. అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బీ), పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, బుచినెల్లిలో మైనార్టీ గురుకుల పాఠశాల భవనం, ధనసిరిలో రైతు వేదికను ప్రారంభించి, మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులపై పెట్టుబడి పెడుతున్నారని, కొన్నేండ్లలో ఫలితాలు వస్తాయన్నారు. దేశంలో ఉన్న పలు రాష్ర్టాలు తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలలను చూసి అక్కడ అమలు చేసేందుకు ప్రయత్నలు చేస్తున్నాయన్నారు. విద్యార్థుల చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చయినా చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలల్లో 12 వేల మంది విద్యార్థులు చదువుకునే వారని, తెలంగాణ రాష్ట్రంలో 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. విద్యార్థులు ఉన్నత చదువుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మైనార్టీ గురుకుల పాఠశాల సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ గురుకుల డైరెక్టర్ షఫీఉల్లా, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ రాజార్షి షా, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్, సర్పంచ్ భరతమ్మ తదితరులు ఉన్నారు.
కొత్తూర్(బీ) అభివృద్ధికి నిధులు
కొత్తూర్(బీ) గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు, పేదల కోసం 50డబుల్ బెడ్రూం ఇండ్లు, మహిళా సంఘ భవనం కోసం నిధులు మంజూరు చేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. కొత్తూర్(బీ) గ్రామంలో రైతు వేదిక, పల్లెప్రకృతి వనాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. దిడ్గి గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. పల్లె ప్రగతిలో ఇంటింటికీ ఎన్ని మొక్కలు పంపిణీ చేశారని కొత్తూర్(బీ) మహిళా సంఘం అధ్యక్షురాలు శంతమ్మను మంత్రి ప్రశ్నించగా, ఆరు మొక్కలు ఇచ్చారని, దానిని ఇంటి ఆవరణలో నాటానని చెప్పింది. తనకు ఇల్లు లేదని మంత్రికి చెప్పగా, డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కొత్తూర్(బీ) గ్రామస్తులు మంత్రి హరీశ్‌రావుకు ఎడ్ల బండిపై ఘన స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎంజీ రాములు, సర్పంచ్ జగన్మోహన్ తదితరులు ఉన్నారు.