వర్గల్, నవంబర్ 13: కార్పొరేట్‌కు దీటుగా వర్గల్ మండలం గౌరారం గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యనందుతున్నది. ఏయేటా వందశాతం ఫలితాలతో ప్రభంజనం సృష్టిస్తున్నది.
అభివృద్ధి పనులకు తోడుగా విద్యలో సైతం ప్రతిభావంతుల గ్రామంగా గౌరారం పేరు గాంచింది. గౌరారం జడ్పీ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో గతంలో అనేక సమస్యలు విద్యార్థులను చుట్టుముడుతుండేవి. ఒక్కోసారి సబ్జెక్టులకు సరిపడా టీచర్లు ఉండేవారుకాదు. ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా ఉండేది. మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా తాగునీటి సమస్యకు చెక్ పెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధతో సన్నబియ్యం భోజనం, చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా శిక్షణతో గౌరారం ప్రభుత్వ పాఠశాల ఐదేండ్లుగా 2016 నుంచి ఇప్పటివరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలో వందశాతం ఫలితాలు సాధిస్తూ కార్పొరేట్ విద్యను తలపిస్తున్నది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి గానూ ఏడుగురు ఉపాధ్యాయులు, 105 మంది విద్యార్థులు ఉన్నారు. ఫిజిక్స్ టీచర్ లేకపోవడంతో ప్రైవేట్‌గా బోధన చేపడుతున్నారు.
రూ.79.55లక్షలతో అభివృద్ధి పనులు
ప్రభుత్వం ప్రైవేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పాఠశాలలో నెలకొన్న వసతులలేమిని గమనించి వాటి సత్వర పరిష్కారంకోసం మొదటి విడత ‘మనఊరు-మనబడి’ కింద రూ.79లక్షల 55 వేల 823 లు మంజూరు చేసింది. ఈ నిధులతో పాఠశాల కిచెన్గది, శానిటేషన్ గది, డైనింగ్‌హాల్, హ్యాండ్‌వాష్ ఏర్పాటు, అదనంగా రెండు గదులు, ప్రహరీ, తరగతి గదుల్లో కరెంట్, ఫ్యాన్లు, పాత పనుల పునరుద్ధరణలాంటివి చేపట్టారు.
త్వరగతినా పనులు పూర్తిచేస్తాం
‘మనఊరు-మనబడి’ కింద మంజూరైన నిధులతో పాఠశాలలో చేపట్టిన కిచెన్‌షెడ్, టాయిలెట్స్ పనులు చివరిదశకు చేరాయి. బడ్జెట్ అంచనా కంటే ఎక్కువగా ఖర్చు అవుతున్నది. అయినాసరే, వసతుల కల్పనలో వెనుకడుగు వేయకుండా ముందుకు పోతున్నాం. సీఎం కేసీఆర్ ఆశమసాధనలో ప్రభుత్వబడిని ప్రైవేటు బడులకుంటే ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం. పాఠశాల పునర్నిర్మాణంలో గ్రామస్తుల తోడ్పాటు ఎంతో ఉంది. ముఖ్యంగా దాతల సహకారంతో కంప్యూటర్లు సమకూర్చాం.
– వినోదానర్సింహారెడ్డి, గ్రామ సర్పంచ్, గౌరారం
అన్ని అంశాలు అర్థమయ్యేలా..
మా ఊరు సింగాయిపల్లి. అక్కడ హైస్కూల్ లేకపోవడంతో ప్రతిరోజూ 2కి.మీ. నడుచుకుంటూ గౌరారం హైస్కూల్‌కు వస్తున్నాం. పాఠశాలలో అన్ని సబ్జెక్టులు అర్థమయ్యేలా సార్లు చెబుతున్నారు. ఏదైనా సందేహం ఉంటే వెంటనే నివృత్తి చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని వసతులు బాగున్నాయి.
– పి.అక్షిత, 8వ తరగతి, జడ్పీహెచ్ఎస్, గౌరారం(విద్యార్థిని)