సిద్దిపేట, జూలై 9 (నమస్తే తెలంగాణ): వానకాలం ప్రారంభమైందంటే వర్షాలు, ఈదురు గాలులకు ఎక్కువగా విద్యుత్ తీగలు పడిపోతుంటాయి. విద్యుత్ సరఫరా అవుతున్న విషయం తెలియక తీగలను, స్తంభాలను పట్టుకొని మూగ జీవాలతో పాటు ప్రజలూ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం. పలు సందర్భాల్లో కిందికి వేలాడుతున్న తీగలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నా అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రమాదాలు ఇలా..
వానకాలంలో ఈదురుగాలులతో విద్యుత్ తీగలు తెగిపోవడం, స్తంభాలు విరిగిపోయి కరెంటు సరఫరరా అవుతుండడంతో పశువులు, ప్రజలు షాక్‌తో మృతి చెందుతున్నారు. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లినప్పుడు అక్కడ సరైన వైరింగ్ లేక ఏమరుపాటుతో ప్రమాదాల బారిన పడుతున్నారు. డిస్ట్రిబ్యూషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనుమతి లేకుండా ఫ్యూజులు మార్చే సందర్భంలో కరెంటు సరఫరా కావడంతో పలువురు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. సర్వీస్ వైర్లు, వీధి దీపాలను సరిచేసేందుకు విద్యుత్ స్తంభాలు ఎక్కినప్పుడు కరెంటు సరఫరా జరిగి మృతి చెందిన సందర్భాలూ ఉన్నాయి.
వానకాలంలో చేయకూడని పనులు..
వర్షం వచ్చిన సమయంలో విద్యుత్ స్తంభాలను తాకరాదు.
నీటిలో పడిన విద్యుత్ వైర్ల జోలికి వెళ్లకూడదు.
భవన నిర్మాణ పనులు చేసేటప్పుడు విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి.
తడి చేతులతో, తడి బట్టలతో విద్యుత్ పరికరాలు ముట్టకోకూడదు. మరమ్మతులు చేయవద్దు.
పిల్లలకు అందేంత ఎత్తులో స్విచ్ బోర్డులు ఏర్పాటు చేయరాదు
స్తంభం, ట్రాన్స్ఫార్మర్ దగ్గర మూత్ర విసర్జన చేయరాదు.
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
విద్యుత్ స్తంభం నుంచి వ్యవసాయ మోటరుకు మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ దూరం ఉంటే గాలులు వీచినప్పుడు వాటి మధ్య ఉండే సర్వీస్ వైరు వదులై మోటరుపై ప్రభావం చూపుతుంది.
విద్యుత్ స్తంభం నుంచి మోటరుకు కరెంటు నేరుగా సరఫరా కాకుండా మధ్యలో ఫ్యూజ్ బ్యాక్, స్టార్టర్ తప్పని సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
అవసరమైనప్పుడు మోటరును పరిశీలించేందుకు, మరమ్మతులు చేసేందుకు అనువుగా ఉండే ప్రాంతంలో బిగించాలి.
విద్యుత్ సరఫరాలో లో ఓల్టేజీని దృష్టిలో ఉంచుకొని సరైన ఫ్యూజును వేయాలి. మోటరు వద్ద ఫ్యూజ్‌లు, ఇండికేటర్ బల్బులు, స్టార్టర్‌ను ఒక చెక్కపై బిగించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుపడబ్బాపై బిగించకూడదు.
విద్యుత్ సరఫరాలో లోపం ఉంటే మెకానిక్‌తో మరమ్మతులు చేయించుకోవాలి. సొంతంగా మోటరును ముట్టుకోవద్దు.
వర్షాలకు తెగిపడిన కరెంటు తీగలకు, విరిగిన విద్యుత్ స్తంభాలకు విద్యుత్ సరఫరా అయితే వెంటనే అధికారులకు తెలియజేసి సరఫరా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలి.