సిద్దిపేట, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా, పట్టణాన్ని అన్ని రంగా ల్లో ముందు నిలుపుతున్నారు. స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటగా తీర్చిదిద్దాలని ఆడబిడ్డల ఆరోగ్యం కోసం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళా ఆరోగ్య సంరక్షణ కోసం ‘రుతుప్రేమ’ పేరిట నూతన కార్యక్రమానికి నాంది పలికారు. మహిళల ఆరోగ్యం.. డబ్బుల ఆదా.. పర్యావరణ పరిరక్షణకు సరికొత్త ప్రక్రియను ప్రారంభించారు. సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు గజ్వేల్, హుస్నాబాద్‌లలో మహిళలకు అవగాహన సమావేశాలు నిర్వహించి రుతుస్రావ శానిటరీ కప్స్, బట్ట డైపర్లు, ప్యాడ్ల ఉచిత అందిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో 5వ, వార్డులో మహిళలు అందరూ ఈ శానిటరీ కప్పులు, క్లాత్ ప్యాడ్లను పూర్తిగా వినియోగిస్తున్నారు. జిల్లాలో సర్వే చేసి, 4లక్షల మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. వారందరూ వీటిని వినియోగించేలా నలుగురితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు మహిళలకు వీటి వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు అపోహలను తొలిగిస్తారు. శానిటరీ కప్పులు వాడేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 10వేల శానిటరీ కప్పులను వాడుతున్నారు. ఎనిమిది వేల మందికి మంత్రి హరీశ్‌రావు సీఎస్ఆర్ నిధులను వెచ్చించి ఉచితంగా అందజేశారు. శానిటరీ కప్పుల ధర ఎంఆర్పీ రూ.850 కాగా, డిస్కాంట్లో రూ.500కు విక్రయిస్తున్నారు. క్లాత్ ప్యాడ్స్ ఎంఆర్పీ ధర రూ.750 కాగా, వీటిని డిస్కౌంట్ ధర 500కు అమ్ముతున్నారు. టీనేజీ అమ్మాయిలకు ఉచితంగా ఇస్తున్నారు.
పలు వార్డుల్లో బహిరంగ చర్చ
‘రుతుప్రేమ’పై పట్టణంలోని పలు వార్డుల్లో మహిళలతో బహిరంగ చర్చకు శ్రీకారం చుట్టారు. మే 6వ తేదీన సిద్దిపేటలోని 5వ వార్డులో పైలట్ ప్రాజెక్టు కింద ‘రుతుప్రేమ’ పేరిట నూతన కార్యక్రమాన్ని సిద్దిపేట సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, పాలకవర్గం, అధికార యంత్రాంగంతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. బెంగళూర్‌కు చెందిన ఓ కంపెనీ సామాజిక బాధ్యతతో ముందుకొస్తే, ‘స్టోన్ సూప్’ అనే స్వచ్ఛంద సంస్థ-సిద్దిపేట మున్సిపాలిటీ సహకారంతో అమలుకు శ్రీకారం చుట్టారు. పది రోజులుగా వార్డులో సర్వే చేసి, మహిళలకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత వస్త్రంతో తయారు చేసిన ప్యాడ్లు, మెడికల్ గ్రేడ్ సిలికాన్ కాప్స్, శిశువులకు వస్త్రంతో తయారు చేసిన డైపర్లను పరిచయం చేశారు. ‘రుతుప్రేమ’ బృందం సిలికాన్ కప్పులను న్యాప్కిన్లు కొన్నట్లు మళ్లీమళ్లీ కొనాల్సిన అవసరం లేదని, ఒక కప్పును 8 నుంచి 10ఏండ్ల వరకు వాడొచ్చని, దీంతో ఖర్చు కూడా తగ్గుతుందని, యేడాదికి రూ.1200 ఆదా చేయవచ్చని సూచించారు. వీటిని అమర్చుకునే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఇక్కడే నాంది పడింది..
సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రతిరోజూ మూడు రకాల చెత్త సేకరిస్తున్నారు. ఒకటి తడి, రెండోది పొడిచెత్త, మూడోది హానికర చెత్త. ఈ హానికర చెత్త సిద్దిపేట మున్సిపాలిటీకి ఒక సవాల్‌గా మారింది. ఇందులో వేసే వస్తువులు బయటకు చెప్పుకోలేనివి ఉన్నాయి. దీంతో వాటిని చెత్త బండికి ఇవ్వకుండా డ్రైనేజీలో పారబోయడంతో అవి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో తట్టుకుని మ్యాన్‌హోళ్లు మూసుకుపోతున్నాయి. ముఖ్యంగా శానిటరీ ప్యాడ్లు, పిల్లల డైపర్లను ఏం చేయాలన్న దానికి సరైన పరిష్కారం దొరకలేదు. ఇవి భూమిలో కలిసిపోవాలంటే వందలాది ఏండ్ల సమయం పడుతుంది. కాల్చడం వల్ల హానికర వాయువులు విడుదలవుతాయని భావించిన మంత్రి హరీశ్‌రావు, బెంగళూర్‌కు చెందిన పర్యావరణవేత్త డాక్టర్ శాంతి నేతృత్వంలోని బృందం పునర్వినియోగానికి అనువుగా డైపర్లు, న్యాప్కిన్లు ఇందుకు సరైన పరిష్కారమనే నిర్ణయంతో ‘రుతుప్రేమ’కు శ్రీకారం చుట్టింది.
మహిళల అభ్యుదయానికి ప్రతీక
మహిళలు సహజంగా ఎదుర్కుంటున్న సమస్య పీరియడ్స్. దానిని ప్రధాన ఎజెండా అంశంగా సమావేశం జరుగడం మహిళల అభ్యుదయానికి ప్రతీక. ఒకప్పుడు ప్రతి ఇంట్లో పీరియడ్స్ విషయం మూడో కంటికి తెలియకుండా ఆడవాళ్లు జాగ్రత్తలు పాటించేవారు. అలాంటిది నేడు ఒక మార్పు కోసం సిద్దిపేటలో సమావేశం జరుగడం అభినందనీయం. వందల మంది మహిళలు కూర్చొని చర్చ చేయడం గొప్పవిషయం. ప్లాస్టిక్ ప్యాడ్ల స్థానంలో క్లాత్ ప్యాడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మార్పునకు సిద్దిపేట నాంది కావాలి.
మహిళల ఆరోగ్య పరిరక్షణకే రుతుప్రేమ..
మహిళలు పీరియడ్స్ సమయంలో ఎదుర్కునే సమస్యలను పరిష్కరించేందుకే ఈ రుతుప్రేమ కార్యక్రమం చేపట్టాం. మహిళల ఆరోగ్యం, డబ్బులు, పర్యావరణ పరిరక్షణ, సౌకర్యం ఈ నాలుగు అంశాలను దృష్టిలో ఉంచుకొని దీనిని ప్రారంభించాం. శానిటరీ ప్యాడ్లకు బదులుగా ‘మెడికల్ గ్రేడ్ సిలికాన్’ తో తయారు చేసిన శానిటరీ కప్‌లను ఉపయోగించాలని సిద్దిపేట మున్సిపాలిటీలో మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా జీరో శానిటరీ వేస్ట్ వార్డుగా తీసుకొని ఒక్క శానిటరీ ప్యాడ్ వెళ్లకుండా పైలట్ ప్రాజెక్ట్ కింద సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులోని మహిళలందరికీ కప్‌లను అందించాం. ఈ శానిటరీ కప్పు పదేండ్ల వరకు వినియోగించుకోవచ్చు. ఇది ఇందులో ఉన్న గొప్పతనం.
శానిటరీ కప్ ఇలా..
పునర్వినియోగానికి వీలు కలిగిన సిలికాన్ కప్‌ను ఉంచ డంతో బహిస్టు స్రావాలను సేకరిస్తుంది. సురక్షితమైన సౌకర్యవంతమైన ఈ కప్ దాదాపుగా పదేండ్లు మన్ని కగా ఉంటుంది. అలర్జీలు కలిగించని, లీక్ కాని, సలుభంగా శుభ్రపరిచే వీలు కలిగి, రెండు మూడేండ్ల వరకు ఉపయోగించుకునేలా, బట్ట న్యాప్కిన్ వ్యర్థాలు వెలువడుటను తగ్గించి డబ్బులను ఆదా చేస్తుంది. చి న్నారులు సున్నితమైన చర్మంపైన మృదువుగా అల ర్జీలు కలిగించన దిగా ఉండి విభిన్నమైన కొలతల్లో అందుబాటులో ఉండి పునర్వినియోగానికి అనుకూలంగా ఉండే బట్ట డైఫర్ వ్యర్థాలు తగ్గిస్తుంది.
ఇబ్బందులపై ఆరా..
అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, ఈ విధానం అమలులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. ఎవరికైనా అనుమానాలుంటే, మహిళా వైద్యులు సాయంతో సందేహాల నివృత్తి కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా మొత్తం విస్తరించేలా కావాల్సిన చర్యలు చేపట్టారు. విపంచి కళా నిలయంలో 3రోజుల పాటు జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన ఉద్యోగినులకు రుతుప్రేమపై అవగాహన కల్పించారు. బ్యాచ్‌ల వారీగా ఉదయం, మధ్యాహ్నం సెషన్స్ నిర్వహించగా, మొదటి రోజున మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, రెండో రోజు పంచాయతీ అండ్ రూరల్ డెవలప్మెంట్, మెప్మా, మూడో రోజు జిల్లా సంక్షేమ శాఖ మహిళా అధికార, సిబ్బంది హాజరయ్యారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళలు, బాలికలకు పీరియడ్స్‌పై పలువురు పర్యావరణ ప్రేమికులు, పట్టణ ప్రముఖ వైద్యులతో కలిసి అవగాహన సదస్సులు చేపట్టింది.