సిద్దిపేట అర్బన్, జూన్ 2: ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఎనిమిదేండ్లలోనే దేశం అబ్బుర పడేలా తెలంగాణ అభివృద్ధి సాధిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ ఓర్వలేకపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని టీహెచ్ఆర్ నగర్లో జిల్లా కురుమ సంఘం భవన నిర్మాణానికి రాష్ట్ర కురు మ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో కలిసి మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఎనిమిదో ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని.. ఈ ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్య, వైద్య రంగాల్లో తెలంగాణలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తున్న విపక్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ర్టానికే ఆదర్శంగా సిద్దిపేటలో కురుమ భవన్ నిర్మాణం చేసుకుంటున్నామని.. సకల వసతులతో కూడిన అద్భుత భవనం నిర్మితమవుతుందని.. దీనికి బీరప్ప కురుమ భవన్‌గా నామకరణం చేసుకుందామని తెలిపారు.
కొమురవెల్లి మల్లన్నకు బంగారు కిరీటం చేపిస్తున్నామని.. మల్లన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కురుమ సంఘం ప్రతినిధులతో కలిసి మంత్రి హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఆర్సీపురం కార్పొరేటర్ పుష్పానగేశ్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, జిల్లా కురుమ సం ఘం ప్రతినిధులు పాల్గొన్నారు.