
మంత్రి హరీశ్‌రావు కృషితో ఉన్నత విద్య సాకారం చిన్నకోడూరు, మే 4 : సిద్దిపేట శివారులోని పెద్దకోడూరు పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో కొత్త కోర్సు మంజూరు చేస్తూ ఇటీవల సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎలక్ట్రికల్ సివిల్ ఇంజినీరింగ్ కోర్సులు ఉండగా.. తాజాగా డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సు మంజూరైంది. ఈ కోర్సులో 60 మంది విద్యార్థినులకు సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో కంప్యూటర్ కోర్సు మొదటగా సికింద్రాబాద్‌లో ఉండగా.. రెండోది పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్ కళాశాల కావడం సిద్దిపేట ప్రాంత విశిష్టతను పెంచినట్లయింది. ఈ ఏడాది నుంచే కొత్త కోర్సు ప్రారంభమవుతుంది. పాలిసెట్ పరీక్షలో ప్రతిభ చూపిన అమ్మాయిలకు ఉచిత కంప్యూటర్ ఇంజినీరింగ్ విద్య అందుతుంది. మూడేళ్ల కాలపరిమితి కలిగిన డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తయ్యాక ఇంజినీరింగ్ కళాశాలలో చేరాల్సి ఉం టుంది. పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 180 మంది, సివిల్ ఇంజినీరింగ్‌లో 180 మంది చదువుతున్నారు. కొత్తగా కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సులో 60 మంది విద్యార్థినులు చేరతారు.
మంత్రి హరీశ్‌రావు పట్టుదలతో..
పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సును ఏర్పాటు చేయడానికి మంత్రి హరీశ్‌రావు పట్టుదలతో వ్యవహరించారు. త్వరలోనే పాలిసెట్ పరీక్ష జరగనున్న క్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖతో ఎప్పటికప్పుడు మాట్లాడి కోర్సు ఆమోదానికి ప్రయత్నించి సఫలమయ్యారు. అతి తక్కువ రోజుల్లో పాలిటెక్నిక్ మహిళా కళాశాలకు కొత్త కోర్సు రావడం ఇదే ప్రథమమని కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ తెలిపారు.
విద్యాక్షేత్రంగా సిద్దిపేట
సిద్దిపేట ప్రాంతం విద్యాక్షేత్రంగా విలసిల్లడం గర్వంగా ఉంది. ఇప్పటికే సిద్దిపేట చుట్టూర 4 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలు, పీజీ కళాశాల, అటానమాస్తో కూడిన మహిళా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇటీవలే సిద్దిపేట ప్రాంతంలో ఐటీ టవర్‌కు భూమిపూజ జరిగింగి. త్వరలోనే సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుతున్నది. ఈ క్రమంలోనే పెద్దకోడూరు పాలిటెక్నికల్ కళాశాలలో కొత్తగా కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సు మంజూరు కావడం హర్షనీయం. కోర్సు నిర్వహణకు కావాల్సిన సౌకర్యా లు, సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయిస్తాం.