
కొమురవెల్లి, మే 4 : పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా పట్టణాలకు దీటుగా గ్రామాలను సిద్ధం చేస్తున్నది. మండలంలోని కిష్టంపేటలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థలో ఉన్న 16 ఇండ్లను, 10 పాడుబాడ్డ బావులు, 06 నీళ్లు పడని బోరుబావులను పూడ్చివేశారు. పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికీ తడిపొడి చెత్త బుట్టలను అందజేయడంతో పాటు ప్రతిరోజు ట్రాక్టర్ ద్వారా తడి, పొడి చెత్తను వేర్వురుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కాగా, గ్రామపంచాయతీ పరిధిలో 8 వార్డులు ఉండగా, జనాభా 1411 ఇందులో మహిళలు 697, పురుషులు 715 ఉన్నారు. 298 ఇండ్లు ఉన్నాయి.
పల్లెలో పచ్చందాలు…
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పచ్చదనం పెంచేందుకు కిష్టంపేటలో ఏర్పాటు చేసి హరిత నర్సరీలో అవసరమయ్యే మొక్కలను పెంచడంతో పాటు రోడ్డు, కాలువలకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి బాటసారులకు చల్లదానాన్ని పంచుతున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పట్టణాల్లోని పార్కులను తలపిస్తున్నది. ఈ వనంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు ఊయల, జారుడబండ వంటి ఆట పరికరాలు ఏర్పాటు చేయడంతో పాటు కాలక్షేపం కోసం వచ్చే వారు కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు.
మెరుగుపడిన మౌలిక వసతులు…
పల్లె ప్రగతితో గ్రామంలో మౌలిక వసతులు సమకూరాయి. వైకుంఠధామ, డంపింగ్ యార్డు నిర్మాణం, ట్యాంకర్, ట్రాలీతో కూడిన ట్రాక్టర్ అందజేయడంతో పాటు ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు, పల్లె పకృతి వనం, వ్యవసాయక్షేత్రాల్లో కల్లాల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు విద్యుత్ సమస్యలను తొలగించారు. గ్రామంలో యువత కోసం సర్పంచ్ బీమనపల్లి కరుణాకర్ గ్రామస్తుల సహకారంతో వ్యయామశాల ఏర్పాటు చేయడంతో కిష్టంపేట అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది.
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..
ప్రభుత్వం గ్రామాల శుభ్రత కోసం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక స్ఫూర్తితో ప్రతిరోజు పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు ప్రభుత్వం ప్రతినెల గ్రామపంచాయతీకి నిధులు అందజేస్తుండడంతో గ్రామంలో సమస్యలతో తొలగిపోవడంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారంతో గ్రామాన్ని స్వచ్ఛతతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం.