
సిద్దిపేట, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేటలో గులాబీ జోరు కొనసాగింది. బల్దియా ఎన్నికల్లో కారుజోరు కొనసాగింది. ఓటర్లు టీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించి ఘన విజయాన్ని అందించారు. సిద్దిపేట పుర ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వానికి మరోసారి మద్దతు తెలిపారు. సబ్బండ వర్ణాలు కారు గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని కట్టబెట్టాయి. ఎన్నికలు ఏవైనా గులాబీ జెండా రెపరెపలాడాలి అనేది సిద్దిపేట ప్రజల నినా దం. సీఎం కేసీఆర్ సహకారంతో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేట పట్టణాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దారు. యావత్తు రాష్ట్రం సిద్దిపేట అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుంటున్నది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేట ప్రజలు అభివృద్ధి, సమర్థ పాలనకే పట్టం కట్టారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పట్టణంలోని అన్నివర్గాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని ఓటు వేశారు.
వార్డుల్లో అభ్యర్థులు అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో టీఆర్ఎస్ నాయకత్వం విజయవంతమైంది. సిద్దిపేట పుర ఓటర్లంతా వార్ వన్‌సైడ్‌లా కారుగుర్తుకు ఓటే సి ఘన విజయాన్ని అందించారు. సిద్దిపేట పట్టణం నలుదిక్కులా అభివృద్ధి చెందింది. సరికొత్త అందాలతో కోమటి చెరువు సింగారించుకుంది. మెడికల్ కళాశాల, విద్య, వైద్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టేడియం, సీసీ రహదారులు, ‘సుడా’ ఏర్పాటు, కూడళ్ల సుందరీకరణ, చెరువుల అభివృద్ధి.. ఇలా ఎన్నో జరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధికి సిద్దిపేట కేరాఫ్‌గా మారింది. భవిష్యత్ తరాల కోసం బాటలు వేసుకున్న పట్టణం అని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధిని చూసి అన్నివర్గాలు అధికార పక్షానికి వెన్నుదన్నుగా నిలిచాయి.
అన్నీ తానై నడిపించిన మంత్రి హరీశ్‌రావు..
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నీ తానై నడిపించారు. ప్రతి ఓటరును కలిసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. నియోజకవర్గంలోని మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను వార్డులకు ఇన్చార్జిలుగా నియమించి పక్కాగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించి ప్రణాళికతో ముందుకెళ్లి సక్సెస్ అయ్యారు. కేవలం నాలుగు రోజులు పట్టణంలో సుడిగాలి ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. సిద్దిపేట అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈసారి కొత్త వారి ఎక్కువ సీట్లు ఇచ్చి వారందరినీ గెలిపించుకున్నారు. యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. పోటీచేసిన సిట్టింగ్‌లు తమ స్థానాలను కాపాడుకున్నారు. కొన్నిచోట్ల పతులకు బదులుగా సతులు, మరికొన్ని చోట్ల సతులకు బదులుగా పతులు సిట్టింగ్ స్థానాల్లో పోటీచేసి విజయం సాధించారు. ఇక ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తంరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ తదితర నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ గూటికి స్వతంత్ర అభ్యర్థులు…
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్టు రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి గెలిచిన అభ్యర్థులు సొంతగూటికి చేరుకోవడానికి ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. మొత్తం ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. వీరంతా టీఆర్ఎస్ పార్టీ రెబల్స్‌గా పోటీచేసిన వారే. 20వ వార్డు నుంచి పోటీచేసి గెలిచిన రియాజ్ సోమవారం సాయంత్రం మంత్రి హరీశ్‌రావును కలిసి టీఆర్ఎస్లో చేరారు. ఆయనతోపాటు మరో ఇద్దరు చేరడంతో టీఆర్ఎస్కు 39కి చేరింది. మరో నలుగురు స్వతంత్రులుగా గెలిచిన వారు కూడా టీఆర్ఎస్ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో సిద్దిపేట టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని మరోసారి రుజువైంది.
అడ్రస్ లేని ప్రతిపక్షాలు…
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు అడ్రస్ లేకుండా పోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డితోపాటు పట్టణ అధ్యక్షుడు, ఇతర నాయకులు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితర నేతలంతా వచ్చి ప్రచారం చేశా రు. కొంతమంది నేతలు సిద్దిపేటలోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట అభివృద్ధ్ది, టీఆర్ఎస్ పార్టీ, మంత్రి హరీశ్‌రావుపైన వారు అడ్డగోలుగా మాట్లాడారు. అఖండ విజయాన్ని కట్టబెట్టి సిద్దిపేట ఓటర్లు వారిని చీకొట్టారు. ఇన్ని సీట్లు గెలుస్తాం.. అన్ని సీట్లు గెలుస్తాం అని గొప్పలు చెప్పిన బీజేపీకి ఓటర్ల తీర్పుతో భంగపాటు తప్పలేదు. ఎన్నికల ముందు వచ్చిపోయే పార్టీలకు సిద్దిపేటలో స్థానం లేదని మరోమారు తమ ఓటు ద్వారా ఓటర్లు గట్టిగా సమాధానం చెప్పారు. 43 వార్డులకు గాను 40 వార్డులు పొటీచేసి కేవలం 1 వార్డును బీజేపీ గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 30 స్థానా ల్లో పోటీచేసి ఒక్కచోట గెలవలేదు. కనీసం పోటీ ఇవ్వలేక పోయింది.